శిధిలమైన ఇంటిలో కూడా బలమైన గోడలు వున్నట్టు ముగిసిన అధ్యాయంలో కూడా ప్రజల్ని మేల్కొలిపే ఎన్నో అనుభవాల సమాహారం ప్రజారాజ్యం. రెండు వర్గాల మధ్య రాజ్యాధికారం ఉండిపోవడాన్ని అప్పటికే మెజార్టీ ప్రజలు అసహనంగా చూస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రజారాజ్యం పార్టీ నూతన ఒరవడిని సృష్టించింది. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అనేక వర్గాలు తాము కూడా పరిపాలనలో రాజ్యాధికారం లో భాగం కావాలని ఆకాంక్షిస్తూ బలంగా మాట్లాడడం మొదలుపెట్టారు. చైతన్యం వెల్లువెత్తిన ప్రతి సందర్భంలోనూ ప్రజారాజ్యం పార్టీ కల్పించిన రాజకీయ అవకాశాలను ఇప్పటికీ కొందరు నాయకులు గుర్తు చేసుకుంటారు.ఆ పార్టీ ప్రస్థానం తొందరగానే ముగిసినా ఆ పార్టీ ద్వారా కొన్ని వేల మంది నాయకులు తయారైన విషయాన్ని ఎవరు మర్చిపోరు. చిరంజీవి నాయకత్వంలో ఏర్పడిన రాజకీయ వ్యవహారాల కమిటీలు భిన్న సామాజిక వర్గాల మేళవించిన అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అనే నినాదాన్ని తెర మీదకు తీసుకు వచ్చింది.
అప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీని ఎదుర్కొని సంయుక్త ఆంధ్రప్రదేశ్లో దాదాపు 80 లక్షల పైచిలుకు ఓట్లు సాధించి ప్రజల ఆకాంక్షకు దర్పణం గా మారింది. కత్తి పద్మారావు, జంగా గౌతమ్, నారగోని, రామచంద్ర రావు ఇలాంటి సామాజిక ఉద్యమ నాయకులని రాజకీయాల్లో మిళితం బడుగు వర్గాల రాజ్యాధికారం సాధనకు చిరంజీవి ముందడుగు వేశారు. సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి ప్రజారాజ్యం అజెండా రూపొందించడంలో అన్ని పార్టీలు ఎంతోకొంత ఆ మార్గంలో ప్రయాణించక తప్పలేదు. రాజ్యాధికారంలో బీసీల వాటా గురించి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాతే చర్చ మొదలైంది. ఓటు బ్యాంకు రాజకీయాలని బట్టబయలు చేసి ఎన్ని ఓట్లు అన్ని సీట్లు ఇవ్వాలనే అంబేద్కర్ నినాదాన్ని.. మహాత్మ జ్యోతిరావు పూలే విధానాన్ని కార్య రూపంలో తీసుకురావడానికి ఆ పార్టీ విస్తృతమైన ప్రయత్నం చేసింది. ఇప్పటికీ చాలా పార్టీలలో కీలకమైన నాయకులుగా ఉన్న వారు ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ గుర్తింపు పొందిన వారే అనేది గమనార్హం.
పార్టీ విలీనంతో చిరంజీవి విమర్శలు పాలైనా పార్టీ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాలు ఇతర పార్టీల్లో బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చి పెట్టాయి. తమ రాజకీయ ప్రాధాన్యత కోసం అన్ని కులాలు అన్ని మతాలు గొంతెత్తి ధైర్యంగా సాంప్రదాయ రాజకీయ పార్టీలని ప్రశ్నించడం మొదలు పెట్టాయి. తద్వారా తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అవకాశం లేని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టాయి . రాజకీయ పార్టీని కొన్ని కుటుంబాల ఆస్తిగా పరిగణించిన సామాన్య ప్రజలు పార్టీలు బ్రహ్మపదార్థం కాదని పార్టీలు అన్ని వర్గాల ప్రతినిధులు ఉండి తీరాలని రాజ్యాధికారం లో భాగంగా అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలని మాట్లాడటం మొదలు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజారాజ్యం పార్టీకి ముందు.. ప్రజారాజ్యం పార్టీ తర్వాత చాలా మార్పులు సంతరించుకున్నాయి. రాజ్యాధికారం ఎజెండాగా అనేక కులాలు మతాలు విస్తృతంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజల ఆలోచనలు ఆగ్రహం గమనించిన అన్ని రాజకీయ పార్టీలు తిరిగి సామాజిక న్యాయం బాట పట్టక తప్పలేదు .ఇదే ప్రజారాజ్యం పార్టీ సాధించిన ఘన విజయం. చిరంజీవి చేసిన గొప్ప ప్రయత్నం వల్ల విస్తృతంగా జరిగిన చర్చ ప్రతి కులంలో చైతన్యాన్ని నింపి ఒక మార్గాన్ని చూపించి వెళ్లిందని చెప్పక తప్పదు
నల్లా శ్రీనివాస్
9959905757