అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడితే వ్యవస్థలో తిరుగుబాటు వస్తుందనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో అదే జరుగుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పార్టీలో అనేక ఏళ్లుగా ఎన్నికలు లేవు, అంతర్గతంగా ఎన్నికైన ఒక కమిటీ కూడా లేదు, పార్టీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు ఇతర అన్ని పదవులకు ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే పార్టీలో ప్రక్షాళన అవసరమని, ఎన్నికల్లో గెలవాలంటే పార్టీని బలోపేతం చేయాల్సిందే అని ఆయన పార్టీని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యల దరిమిలా పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది ఆయనకు మద్దతుగా మరింతమంది పార్టీపై తిరుగుబాటు కి సిద్ధమవుతున్నారనేది అంతర్గత సమాచారం. అత్యున్నత స్థాయి నుండి అధఃపాతాళానికి పడిపోవడం అంటే ఏమిటో కాంగ్రెస్ పార్టీ రూపంలో మన కళ్ళ ముందే సాక్ష్యంగా నిలుస్తుంది.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ నేడు నడిపించే సరైన నాయకుడు లేక బేల చూపులు చూస్తుంది. కాకలు తీరిన యోధులు లాంటి నాయకులు నేడు తమ రాజకీయ జీవితాలను సమాధి చేసిన పార్టీగా కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. అధిష్టానం చెప్పిన విధంగా పాటించాలి వాళ్ల అడుగులకు మడుగులొత్తుతూ బతకాలి, జి హుజూర్ అంటూ వాళ్ళ ముందు సలాములు చేయాలి, చేవ చచ్చి నడుము విరిగిన వారి లాగ నడుచుకోవాలి. ఇదే వందేళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నడిచే అంతర్గత ప్రజాస్వామ్యం. ఇప్పుడు గాంధీ కుటుంబం కోటలు బద్దలు కొట్టడానికి పార్టీలో ఇతర ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారనేది వినిపిస్తున్న మాట భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం
