లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నటుడు సుధాకర్ కోమాకుల, హరిక దంపతులు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఛాలెంజ్ సినిమా లో ఇందువదన కుందరదన అనే సూపర్ హిట్ సాంగ్ కి అదిరిపోయే విధంగా డాన్స్ చేసి పుట్టిన రోజు కానుకగా అందించారు. ఈ పాట చూసిన చిరంజీవి చాలా సంతోషంగా ఆ దంపతులకు ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ లో వారిని ఉద్దేశించి చిరంజీవి చెప్పిన మాటలు..
హాయ్ డియర్ సుధాకర్ హరిక.. ఎలా ఉన్నారు? నా పుట్టినరోజు నాడు మీరిచ్చిన విజువల్ ట్రీట్ కి నా ధన్యవాదాలు. ఆ సాంగ్ చూస్తున్నప్పుడు నా గత స్మృతులు ఛాలెంజ్ డేస్ గుర్తుకురావడం ఒకవైపు అయితే మీరు ఆ డ్యాన్స్ ని రీప్రోడ్యూస్ చేయడానికి ప్రయత్నించి ప్రాక్టీస్ చేయడం, షూట్ చేయడం, నాకు పంపించడం ఇవన్నీ చేస్తున్నంతసేపు మనసులో నన్ను తలుచుకుంటూ
మీ అభినందనలను నాకు పంపించి నన్ను సంతోషింప చేయాలని, నా పైన ఉన్న ప్రేమను తెలియజేయాలని మీరు చేసిన ఈ ప్రయత్నం మీరు ఊహించిన దాని కన్నా నన్ను ఎక్కువగా సంతోషింపచేసింది. మీరు ఇండియాలో ఉంటే గనుక నా సంతోషం ఇంకోలా తెలిపే వాడిని కానీ మీరు ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇలా వాయిస్ మెసేజ్ పెడుతున్నాను.
సుధాకర్ నువ్వు అంటే సినిమా హీరో వి డాన్స్ చేస్తావు అది ఊహించగలను, కానీ హరిక టేకి, IT రంగానికి చెందిన మహిళ సినిమాకు సంబంధం లేని అమ్మాయి అయి ఉండి చాలా చక్కగా డ్యాన్స్ చేయడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం తో పాటు మిక్కిలి ఆనందం కలిగించింది. తన గ్రేస్ ,స్టైల్ కి తనకి కొంచెం ఎక్కువ మార్కులు వేస్తూ నా తీర్పు చెబుతున్నాను.. ఏమనుకోకు..
అఫ్ కోర్స్, అంతా నీ ట్రైనింగ్ అయి ఉంటుంది. మీ దంపతులు చక్కని అవగాహనతో ఎలా అయితే డ్యాన్స్ చేసి రక్తికట్టించారో, జీవితంలో కూడా అంతే అవగాహనతో, అండర్స్టాండింగ్ తో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా చేసుకుంటూ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మీకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ వాయిస్ మెసేజ్ పంపించారు.
ఈ మెసేజ్ చూసిన సుధాకర్ హారిక దంపతులు వి లవ్ యు మెగాస్టార్ గారు మా ప్రయత్నం మీకు చేరి మీరు అభినందించడం మేము ఊహించనిదంటూ ఆ దంపతులు తమ సంతోషాన్ని తెలియజేశారు.