మన చిన్నతనంలో ఒక సినిమా విజయం సాధిస్తే 200, 150, 100 ఇలా నెలల తరబడి థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచేవి.
తర్వాత కాలంలో టీవీ రంగం లో వచ్చిన సంచలన మార్పుల వలన థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను తగ్గించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఒక సినిమా 100 రోజుల పండుగ జరుపుకుంటే చాలా గొప్ప విషయమే అనే విధంగా పరిస్థితి మారిపోయింది.
కేవలం రెండు మూడు వారాల్లోనే సినిమా భవిష్యత్తు తేలిపోతుంది. మల్టీప్లెక్స్‌లు వచ్చిన తర్వాత సింగల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరింత దిగజారి పోయింది. చాలా మంది సొంత థియేటర్ కలిగిన ఎగ్జిబిటర్లు కోట్ల రూపాయల జూదం లాంటి సినిమా వ్యాపారంలో తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చే 10% సక్సెస్ రేటు వలన బికారులై ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్దారు. ఇంకొంతమంది ఎగ్జిబిటర్లు థియేటర్ల నిర్వహణ చేయలేక బయట వ్యక్తులకు లీజు ప్రాతిపదికన ఇచ్చేశారు. ఇప్పుడు కరోనా ప్రభావం వలన 5 నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి. థియేటర్ ఓనర్లు లీజు డబ్బులు అందక, లీజుకు తీసుకున్న వారు లీజు డబ్బులు చెల్లించలేక సతమతమవుతున్నారు.
ఇప్పట్లో థియేటర్ లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ అన్ లాక్ 4 లో థియేటర్లు తెరుచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా ఇంతకుముందులా జనం వస్తారో రారో తెలియని పరిస్థితి.
పైగా సామాజిక దూరం ఆంక్షల వలన 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడపడం సాధ్యమయ్యే పనికాదు. పైగా ప్రతి షో కి థియేటర్ మొత్తం శానిటైజ్ చేయడం లాంటి అదనపు ఖర్చులు మరింత భారం అవుతాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1700 సింగల్ స్క్రీన్ థియేటర్లకు గాను 1200 ల థియేటర్లలో మాత్రమే ప్రదర్శనలు చేస్తున్నారు. మిగిలినవి మూతపడ్డాయి.
ముందు ముందు ఇంకెన్ని మూతపడతాయో తెలియని పరిస్థితి.
కరోనా సంక్షోభం ముగిసేనాటికి పట్టణ ప్రాంతాల్లో థియేటర్ ల గురించి పక్కన పెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి చాలా వరకు మరుగున పడే అవకాశం ఉంది. ఇదే కాక థియేటర్లను నమ్ముకొని కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు. వారందరికీ ఉపాధి లేక వేరే వృత్తి చేతకాక కన్నీరు పెట్టుకునే పరిస్థితుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. ఈ సంక్షోభాలను, సమస్యలను దాటుకొని మళ్లీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో, వెండితెరను నమ్ముకొని బతుకుతున్న వారి జీవితాల్లో వెలుగు ఎప్పుడు ప్రసరిస్తుందో అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.