పాకిస్తాన్ ప్రతిష్ట మంటగలిపే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చదివాక ఇలాంటివి కూడా జరుగుతాయా అని మీరు ఖచ్చితంగా అవాక్కవకపోతే చూడండి. ఇంతకీ ఇస్లామాబాద్ కి అవమానకరమైన ఆ విషయం ఏమిటంటే, పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ ముస్తఫా అన్వర్ 2001-2002 మధ్యకాలంలో ఇండోనేషియాలోని పాకిస్తాన్ రాయబారిగా పనిచేసాడు. అక్కడ రాయబారిగా పని చేసే సమయంలో ఆ పెద్దమనిషి ఏకంగా ఇండోనేషియా జకార్తాలోని ఎంబసీ భవనాన్ని విక్రయించేసారని పాకిస్తాన్ “నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో” ఆరోపిస్తోంది. జకార్తాలో తన నియామకం జరిగిన వెంటనే, అన్వర్ ఈ భవనాన్ని రహస్యంగా విక్రయించే పని ప్రారంభించాడని పాకిస్తాన్ యొక్క అవినీతి నిరోధక సంస్థ ఆరోపించింది.
పాక్ ఇంగ్లీష్ డైలీ ది ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన ఒక కధనం ప్రకారం, అన్వర్ ఎంబసీ భవనాన్ని అక్రమంగా విక్రయించాడని, తద్వారా పాకిస్తాన్ జాతీయ ఖజానాకు 1.32 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఎబి) ఆగస్టు 19 న మేజర్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ ముస్తఫా అన్వర్‌పై కోర్టులో నివేదిక సమర్పించింది.
పాకిస్తాన్లో నాబ్ బాగా పనిచేస్తుందని తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేయకండి. అసలు నాబ్ మూలంగానే మాజీ రాయబారికి వ్యతిరేకంగా అవినీతి కేసులు ఆలస్యం అవుతున్నాయని పాకిస్తాన్ సుప్రీంకోర్టు గత నెలలో అక్షింతలు వేసాకనే ఆ సంస్థ ఈ నివేదిక కోర్టుకి ఇచ్చింది. అంతేకాదండోయ్ జూలై 2020 లో, సుప్రీంకోర్టు NAB యొక్క అధికారులను “సమర్థులు కారు” అని మొట్టికాయలు వేసింది.