Case Registered against Nayanthara Movie : నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూరణి. ఓటీటిలో రిలీజ్ అయి మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇంతకుముందే డిసెంబర్ లో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శించబడింది. అయితే తాజాగా ఈ మూవీ పైన కేసు నమోదయింది. దానికి కారణం ఈ సినిమాలో హిందుత్వాన్ని కించపరిచేలాగా, అలాగే శ్రీరాముడిని కించపరిచేలాగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ కేస్ ని నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే మాజీ శివసేన నేత రమేష్ సోలంకి ఈ సినిమా పైన పోలీసులకు ఫిర్యాదును అందజేశాడు. ఆయన పిటిషన్ లో ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా కొన్ని సన్నివేశాలను చేర్చారని, అలాగే లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తూ కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ముఖ్యంగా పేర్కొన్నారు. ఆయన ఈ రకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఆయన తన ఫిర్యాదులో అన్నపూరణి సినిమాను నిర్మించిన నిర్మాతలతో పాటుగా, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయినా నెట్‌ఫ్లిక్స్ పైన, అలాగే దర్శకుడు నీలేష్ కృష్ణ పైన, వీరితోపాటు హీరోయిన్ నయనతార, హీరో జై పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు ఫిర్యాదును అందజేశాడు.
వీరందరిపై త్వరగా తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే స్ట్రీమింగ్ ని ఆపేయాలని మహారాష్ట్ర హోమ్ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆయన అభ్యర్థించారు. కానీ ఇప్పటివరకు కూడా అన్నపూరణి సినిమాకు సంబంధించిన మేకర్స్ ఎవరు కూడా ఈ పిటిషన్ పైన స్పందించలేదు.
