రెండుసార్లు చావు అంచుల వరకు డీజే టిల్లు హీరో.. అంత జరిగినా ఎలా సేఫ్ అయ్యాడంటే..
యువ హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు చిత్రంతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్లే బాయ్ పాత్రలు సిద్దుకి బాగా సెట్ అవుతున్నాయి. అలాంటి చిత్రాలతోనే సిద్దు మంచి వినోదం అందిస్తున్నాడు. మార్చిలో సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు చూస్తుంటే ఇద్దరూ రొమాన్స్ లో రెచ్చిపోయినట్లు ఉన్నారు.
సిల్వర్ స్క్రీన్ పై ఎంత అల్లరిగా కనిపించినా రియల్ లైఫ్ లో సిద్దు హుందాగా బాధ్యతాయుతంగా ఉంటాడు. హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో సిద్దు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విద్యార్థులకు, యువకులకు ట్రాఫిక్ రోల్స్ పాటించాలని.. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ వాడడం, సీట్ బెల్ట్ ధరించడం వల్ల తాను రెండు సార్లు రోడ్డు ప్రమాదాల నుంచి సేఫ్ గా బయటపడ్డట్లు గుర్తుచేసుకున్నాడు .
తాను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కీసరగుట్ట నుంచి ఈసీఐఎల్ కి ప్రతి రోజు బైక్ పై వెళ్ళేవాడిని. ఒకరోజు నేను 70-80 స్పీడులో వెళుతున్నా. నా పక్కనే వస్తున్న వ్యక్తి బైక్ హ్యాండిల్ నాకు తగిలింది. వెంటనే కింద పడిపోయా. ఒళ్ళంతా గాయాలయ్యాయి.
హెల్మెట్ కింది భాగం విరిగిపోయింది. పైభాగం కూడా క్రాక్ ఇచ్చింది. అంటే ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవచ్చు. హెల్మెట్ లేకుంటే ఆ రోజు అక్కడికక్కడే మరణించేవాడిని అని సిద్దు విద్యార్థులకు తెలిపాడు. ఈ రోజు మీ ముందు ఇలా ఉన్నానంటే అందుకు కారణం హెల్మెట్ అని సిద్దు తెలిపాడు.
మరో ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కారులో 120 కిమీ స్పీడ్ లో వెళుతున్నా. ఆరోజు జరిగిన యాక్సిడెంట్ లో కారు బోల్తా పడింది. కానీ సీటు బెల్టు పెట్టుకోవడంతో నేను సేఫ్ అయ్యా అని గుర్తు చేసుకున్నారు. ఇంత జరిగిన సిద్దు సేఫ్ అయ్యాడంటే అదృష్టవంతుడే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
