Oscars 2024 : క్లీన్ స్వీప్ చేసిన ‘ఓపెన్ హైమర్’.. ఫస్ట్ టైం ఆస్కార్ గెలవడంతో రాబర్ట్ డౌనీ ఎమోషనల్, భార్యకి అంకితం
96వ అకాడమీ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డుల వేడుకని వైభవంగా నిర్వహించారు. గత ఏడాది ఆస్కార్ అవార్డులలో ఇండియాకి తీపి జ్ఞాపకాలు మిగిలాయి. ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రాలు ఆస్కార్ సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాది నిరాశే మిగిలింది.
అయితే ఈ ఏడాది అకాడమీ అవార్డులలో అంతా ఊహించినట్లుగానే ఓపెన్ హైమర్ చిత్రం దుమ్ములేపింది. 7 కీలక విభాగాల్లో క్రిస్టఫర్ నోలెన్ చిత్రానికి అవార్డులు దక్కాయి. ఏయే విభాగాల్లో ఓపెన్ హైమర్ చిత్రం ఆస్కార్ అవార్డులు సాధించిందో ఒకసారి ఆ జాబితా చూద్దాం.
ఉత్తమ దర్శకుడు : క్రిస్టఫర్ నోలెన్
ఉత్తమ నటుడు : కిల్లియన్ మర్ఫీ
ఉత్తమ సహాయ నటుడు : రాబర్ట్ డౌనీ జూనియర్
ఉత్తమ చిత్రం : ఓపెన్ హైమర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ : హొయటే, హొయటేమ
ఉత్తమ ఎడిటింగ్ : జెన్నిఫర్ లైమ్
ఉత్తమ ఒరిజినల్ బ్యాగ్రౌండ్ స్కోర్ : లుడ్విగ్ గోర్నస్
ఇలా మొత్తం 7 విభాగాల్లో ఓపెన్ హైమర్ చిత్రమే ఆస్కార్ అవార్డులు క్లీన్ స్వీప్ చేసింది. ఇరాన్ మ్యాన్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాబర్ట్ డౌనీ.. తన కెరీర్ లో తొలిసారి ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. 58 ఏళ్ళ వయసులో డౌనీ ఆస్కార్ ని ముద్దాడాడు. ఓపెన్ హైమర్ చిత్రంలో లూయిస్ స్ట్రాస్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో డౌనీ అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే.

తొలిసారి ఆస్కార్ అందుకోవడంతో రాబర్ట్ వేదికపై ఎమోషనల్ అయ్యాడు. తన జీవితంలో ఒడిదుడుకుల సమయంలో అండగా నిలిచిన తన భార్య సుసాన్ కి ఈ అవార్డు అంకితం ఇచ్చాడు.
