పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా భాజపా మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయంతో దూకుడుగా వెళుతున్న మోడీ ప్రభుత్వానికి స్వపక్షం నుండే వ్యతిరేకత రావడం ఒక రకంగా షాక్ అని చెప్పాలి. కేంద్రం ప్రవేశపెట్టిన నిత్యావసర సరుకుల బిల్లు, రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య బిల్లు, రైతు ధరల హామీ సేవల బిల్లులు వ్యవసాయ రంగానికి తీరని నష్టమని, ఆ చట్టాలకు నిరసనగా నేను కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశానని, వారి కుమార్తెగా సోదరిగా రైతుల పక్షాన నిలబడటం గర్వంగా ఉంది అని రాజీనామా అనంతరం హర్ సిమ్రత్ కౌర్ వ్యాఖ్యానించారు.
రైతులకు, వ్యవసాయ రంగానికి భారీ ఉతమిచ్చే విధంగా నూతనంగా ప్రవేశపెట్టిన బిల్లులు ఉన్నాయని అధికారపక్షం చెబుతుంటే, విపక్షాలు ఈ బిల్లులు ఆమోదం పొంది చట్ట రూపం దాల్చితే రైతులకు తీరని నష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు విపక్షాల ఆందోళన కు భాజపా మిత్ర పక్షం నుండి మద్దతు తెలపడం కేంద్రానికి మింగుడుపడని విషయం. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినా శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గుతుందా అనేది కీలకంగా మారింది. ఏం జరుగుతుందో చూద్దాం