Saiyara: అంచనాల్లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘సైయారా’..
Saiyara: స్టార్ హీరోలు లేరు, భారీ ప్రమోషన్లు లేవు. అయినా ‘సైయారా’ (Saiyaara) సంచలనం సృష్టిస్తోంది. జులై 18న నిశ్శబ్దంగా విడుదలై, కేవలం మౌత్ టాక్‌తోనే ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ₹100 కోట్ల క్లబ్లో చేరి, ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
‘సైయారా’ కథేంటి?
ఇది కేవలం భావోద్వేగాల బలంపై నడిచే సినిమా. కృష్ (అహన్ పాండే) అనే సంగీత ప్రియుడు, జర్నలిస్ట్ వాణి (అనీత్ పడ్డా) ప్రేమకథ ఇది. వాణి గతంలో ఎదుర్కొన్న మోసం, మానసిక సమస్యలు, తిరిగి జీవితంలోకి వచ్చిన ఆమె మాజీ ప్రియుడు మహేష్, ఈ పరిస్థితుల్లో కృష్, వాణిల ప్రయాణం… ఇవన్నీ హృదయాన్ని హత్తుకునేలా చిత్రీకరించారు. కొత్త నటులైన అహన్ పాండే, అనీత్ పడ్డా తమ పరిణతి చెందిన నటనతో ఆకట్టుకున్నారు.
సంగీతమే ప్రాణం!
సినిమా విజయానికి సంగీతం కూడా ప్రధాన కారణం. సందర్భానుసారం వచ్చే పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను లీనమయ్యేలా చేస్తాయి. ఈ సినిమాను ‘ఆషికి 2’ చిత్రంతో పోలుస్తున్నారు ప్రేక్షకులు. విశేషమేంటంటే, ఈ రెండు చిత్రాలను తెరకెక్కించింది మోహిత్ సూరి కావడం విశేషం.
అంచనాలు దాటిన విజయం
రొమాంటిక్ చిత్రాలకు ప్రసిద్ధిగాంచిన బాలీవుడ్ కొంతకాలంగా యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపుతోంది. ఈ తరుణంలో ‘సైయారా’ వంటి స్వచ్ఛమైన ప్రేమకథ విజయం సాధించడం గర్వించదగిన విషయం. కంటెంటే కింగ్ అని మరోసారి నిరూపితమైంది. కేవలం ఉత్తరాదిలోనే కాకుండా, మహేష్ బాబు, సుకుమార్ వంటి దక్షిణాది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రశంసించారు. ‘సైయారా’తో బాలీవుడ్‌కు తిరిగి తన పూర్వ వైభవం వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు.
ఇద్దరూ కొత్తవారే
తొలి ప్రయత్నంలోనే నటనలో పరిణతి చూపించి, కొత్తవారనే ఆలోచన రాకుండా చేశారు అహాన్ పాండే, అనీత్ పడ్డా. అహాన్ మరెవరో కాదు.. నటుడు చంకీ పాండే సోదరుడైన చిక్కీ పాండే కుమారుడు. కొన్ని కమర్షియల్ యాడ్స్, ‘సలామ్ వెంకీ’ సినిమాలో నటించిన అనీత్ ‘సైయారా’తో హీరోయిన్ అయింది అనీత్ పడ్డా.
