Vidya Balan: దీపికా పదుకొణెకు మద్దతుగా నిలిచిన విద్యాబాలన్.. ఏమన్నారంటే?
Vidya Balan: సందీప్ రెడ్డి వంగా – దీపికా పదుకొణె మధ్య వివాదానికి దారితీసిన పని గంటల వ్యవహారంపై ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ దీపికా పదుకొణెకు మద్దతుగా నిలిచారు. సినీ పరిశ్రమకు వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్‌లో గత కొద్దికాలంగా తీవ్ర చర్చకు దారితీసిన పని గంటల వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..
ఆమె మాట్లాడుతూ కొత్తగా తల్లి అయిన మహిళలకు పరిమిత పని గంటలు ఉండాలని అన్నారు. ఇటీవల దీపికా పదుకొణె అధిక పని గంటల కారణంగా ఒక భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో విద్యాబాలన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

కొత్త తల్లులకు అనుకూలమైన షిఫ్టులు అవసరం..
కొత్త తల్లులకు అనుకూలమైన షిఫ్ట్‌లు అవసరమని, బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉందని, వారిపై బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు. అలాంటి వారికి పరిశ్రమలో మద్దతు ఇవ్వాలంటే, మరింత సానుభూతితో కూడిన పని సంస్కృతిని అవలంబించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

“నాకు పిల్లలు లేరు కాబట్టి, నేను 12 గంటలైనా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడ షూటింగ్ చేసినా, అక్కడికి వెళ్లి షూట్‌లో భాగం కావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని విద్యాబాలన్ పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత పరిస్థితి అని, అయితే కొత్త తల్లుల విషయానికి వస్తే, వారికి తప్పకుండా అనువైన పని గంటలు ఉండాలని ఆమె సూచించారు.
ఎంతో ఒత్తిడికి గురయ్యాను..: విద్యాబాలన్
2005లో ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విద్యాబాలన్, ‘ది డర్టీ పిక్చర్’ వంటి చిత్రాలతో విశేషమైన ప్రజాదరణ, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తన ఇన్నేళ్ల కెరీర్‌లో ఎంతో ఒత్తిడికి గురైనట్లు విద్యాబాలన్ తెలిపారు. ప్రస్తుతం ఆ ఒత్తిడికి దూరంగా ఉంటూ, తన సమయాన్ని ఆస్వాదిస్తున్నానని, తనకు వచ్చిన స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నానని ఆమె చెప్పారు. రెండు కొత్త సినిమాలను అంగీకరించానని, వాటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని విద్యా బాలన్ వెల్లడించారు.
