Mission Impossible OTT: ‘మిషన్ ఇంపాసిబుల్: ది ఫైనల్ రెకనింగ్’..
Mission Impossible OTT: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఉర్రూతలూగించిన హాలీవుడ్ ఫ్రాంచైజీలలో ‘మిషన్ ఇంపాసిబుల్’ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ చిత్రాల్లో టామ్ క్రూజ్ సాహసాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చొబెడతాయి. ఈ సిరీస్‌లో ఎనిమిదో భాగమైన ‘మిషన్ ఇంపాసిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
టామ్ క్రూజ్ ఈథన్ హంట్‌గా తనదైన శైలిలో చేసిన యాక్షన్ విన్యాసాలు, అద్భుతమైన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఆగస్టు 19వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 589 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.
కథ ఏంటంటే..?
ప్రపంచాన్ని శాసించే శక్తిగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అయిన ‘ది ఎంటిటీ’ని నియంత్రించే తాళాలను సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఈ డిజిటల్ విలన్ ప్రపంచ దేశాలను విడదీస్తూ, జాతుల మధ్య చిచ్చు పెడుతూ, రాజకీయ సంక్షోభాలను సృష్టిస్తూ మానవాళిని అణు యుద్ధానికి దగ్గర చేస్తోంది. ఈ కీలకమైన తాళాలు వారి చేతికి చిక్కకుండా ఎంఐ ఏజెంట్ ఈథన్ హంట్ (టామ్ క్రూజ్) వాటిని దక్కించుకుంటాడు. అయితే, సముద్రగర్భంలో అత్యంత లోతైన ప్రదేశంలో మునిగిపోయిన సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్‌లో ‘ఎంటిటీ’ యొక్క అసలు సోర్స్ కోడ్ ఉంటుంది.
ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీనైనా నియంత్రించగల శక్తిగల ‘ఎంటిటీ’ని నాశనం చేసి, ప్రపంచాన్ని కాపాడమని అమెరికా అధ్యక్షురాలు ఎరికా స్లోన్ (ఏంజెలా బాసెట్) ఈథన్‌కు వాయిస్ నోట్ పంపుతుంది. ‘ఎంటిటీ’ని నాశనం చేసేందుకు ఈథన్ హంట్ చేసిన సాహసం ఏంటి? కంటికి కనిపించని ఈ అత్యాధునిక శత్రువుతో అతడు ఎలాంటి యుద్ధం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏమిటి? తన ప్రాణ స్నేహితులను కోల్పోయాడా? అన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
ఎలా ఉందంటే..?
‘మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్’ను తీర్చిదిద్దడంలో దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రథమార్థంలో కథ, యాక్షన్ అంశాలకు సమ ప్రాధాన్యమివ్వగా, ద్వితీయార్థంలో మాత్రం యాక్షన్ కన్నా డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
అసలు కథ ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, డ్రామా, యాక్షన్ కోరుకునే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్ వద్దకు వెళ్లే మార్గాన్ని అన్వేషించడంతోనే ప్రథమార్ధమంతా సాగుతుంది.
ఈ సినిమా డిజిటల్ వర్షన్‌లో విమానాలపై, సముద్రపు సాహసాల్లో తీసిన స్టంట్‌లు ఎలా తెరకెక్కించారో చూపించే ప్రత్యేక వీడియోలు, తొలగించిన సన్నివేశాలు, దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీతో ప్రత్యేక ఇంటర్వ్యూలు, టామ్ క్రూజ్‌తో పాటు చిత్ర బృందం మాట్లాడిన వీడియో బైట్స్‌ను ఇందులో చేర్చారు. ఈ సినిమా 2025 మే 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
