SSMB29 Update: ‘SSMB29’పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
SSMB29 Update: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 కోసం సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా గురించి అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి, మహేష్ బాబు మీడియా ముందుకు వచ్చి SSMB29 గురించి వివరిస్తారని ఆశించినా.. ఇప్పటివరకూ అలాంటి ఏదీ లేదు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా.. దీనిపై ఎలాంటి అధికారిక అప్డేట్లు మాత్రం ఇవ్వడం లేదు చిత్ర బృందం. ఇలాంటి తరుణంలో SSMB29లో కీలక పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ప్రేక్షకుల అంచనాలను అమాంతం పెంచేశాయి.
తాజాగా తన చిత్రం ‘సర్జమీన్’ ప్రమోషన్లలో భాగంగా SSMB29 గురించి మాట్లాడుతూ, “ఇప్పటివరకూ ఎవరూ ఊహించని విధంగా రాజమౌళి ఈ కథను తీర్చిదిద్దుతున్నారు. అదొక అద్భుత దృశ్యకావ్యం. రాజమౌళి సర్ ఎంచుకునే కథలన్నీ భారీగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరినీ అలరించేలా కథను చెప్పడంలో ఆయన లెజెండ్. ఈ సినిమాను విజువల్ ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు” అని పృథ్వీరాజ్ వెల్లడించారు. ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడి కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతమందిస్తుండగా, కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణకు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు శ్రీలంకకు వెళ్లగా, ప్రియాంక చోప్రా కూడా బహమాస్ తీరంలో సేద తీరుతున్నారు. ఆగస్టులో తిరిగి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి జూలైలో కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని ప్రణాళిక వేశారు. కానీ అక్కడ నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఆ షెడ్యూల్ తాత్కాలికంగా వాయిదా పడింది. రాజమౌళి గత బ్లాక్‌బస్టర్‌లైన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలకంటే SSMB29 మరింత భారీగా ఉంటుందని అంచనా. పృథ్వీరాజ్ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.