OTT Apps Ban: ఉల్లు, అల్ట్ సహా 24 ఓటీటీ యాప్‌లపై నిషేధం.. ఎందుకంటే?
OTT Apps Ban: అశ్లీల కంటెంట్‌ను కట్టి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న ఓటీటీ యాప్‌లపై బ్యాన్ విధించింది. ఇందులో ఉల్లు, అల్ట్ లాంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లు కూడా ఉన్నాయి. 24 యాప్‌లు, వెబ్సైట్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నిషేధిత యాప్‌లు, వెబ్సైట్ల లింక్‌లు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. “ఉల్లు, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్, దేశీఫ్లిక్స్, గులాబ్ యాప్ వంటివి పలుమార్లు నిబంధనలను ఉల్లంఘించి తమ ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని గుర్తించాం. అందుకే వాటిపై కఠిన చర్యలు తీసుకున్నాం” అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలని..
ఓటీటీ ప్రసార యాప్‌లు, వాటి సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించింది.
డబ్బులు తీసుకుని అశ్లీల కంటెంట్ ప్రసారం..
భారత్‌లో పోర్న్ సైట్లపై నిషేధం ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో కోట్ల మంది ఈ సైట్లను చూస్తున్నారు. అయితే, కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని యాప్‌లు అధికారికంగానే పోర్న్, సాఫ్ట్ పోర్న్‌ను ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు డబ్బులు తీసుకుని యూజర్లకు అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయి.
తాజా నిషేధిత జాబితాలో ఉల్లు, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లిక్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్‌ప్రైమ్, ఫెనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ఎక్స్ వీఐపీ, హల్చల్ యాప్, మూడ్ఎక్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, ఫూగీ, మోజ్ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్ వంటివి ఉన్నాయి.