Mirai Single: ‘మిరాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్.. వైబ్ ఉంది బేబీ అంటూ కుమ్మిపడేసిన తేజ
Mirai Single: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’ ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న సినిమా కావడంతో, ‘మిరాయ్’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో, ఏకంగా 8 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా, తాజాగా ‘వైబ్ ఉంది’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ‘హనుమాన్’ సినిమాకు సంగీతం అందించిన గౌర హరి స్వరపరిచిన ఈ పాట, యువతను ఆకట్టుకునే క్యాచీ ట్యూన్‌తో తీర్చిదిద్దారు. ముఖ్యంగా అర్మాన్ మాలిక్ తన గాత్రంతో ‘వైబ్ ఉంది బేబీ’ అనే బీట్‌ను పాడుతూ, వింటేజ్ స్టైల్ సాంగ్‌ను గుర్తుచేశారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం కూడా పాటకు మరింత హుషారు తెచ్చింది.
ఈ పాటలో తేజ సజ్జా స్టైలిష్‌గా, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకోగా, హీరోయిన్ రితికా నాయక్ తన గ్లామర్‌తో కట్టిపడేసింది. కమెడియన్ గెటప్ శ్రీను సైతం ఈ పాటలో కనిపించి సందడి చేశారు. ఓవరాల్‌గా, ‘మిరాయ్’ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘మిరాయ్’ చిత్రంపై అంచనాలు పెరగడానికి మరో కీలక అంశం బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఎంట్రీ. ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’, ‘దేవర’ వంటి చిత్రాల హిందీ హక్కులను తీసుకుని భారీ లాభాలు గడించిన కరణ్ జోహార్, ‘మిరాయ్’ విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరణ్ జోహార్ తన సినిమాలకు ఇచ్చే భారీ ప్రమోషన్, బాలీవుడ్‌లో ఆయనకున్న క్రేజ్ ‘మిరాయ్’కి చాలా పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.
