Kingdom Success: కింగ్డమ్ 2లో అగ్రహీరో ఉంటాడంటూ నాగవంశీ హింట్..!
Kingdom Success: గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ‘కింగ్డమ్’ చిత్రం హిట్ తెచ్చిపెట్టింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో జూలై 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ విజయవంతంగా దూసుకుపోతోంది. తొలిరోజే అద్భుతమైన ఓపెనింగ్స్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది.
సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో.. చిత్రబృందం తక్షణమే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ దేవరకొండతో పాటు సత్యదేవ్, వెంకటేష్ పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకున్నట్టే ‘కింగ్డమ్’ విజయం సాధించడం ఆనందంగా ఉందని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు.
“ప్రేక్షకుల స్పందన మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని పంచింది. అమెరికాలో ప్రదర్శనలు మొదలైనప్పటి నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ‘అన్నా.. మనం హిట్ కొట్టినం’ అంటూ భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. ఆ ఆనందంలో నన్ను కూడా ఏడిపించారు. అందరి ప్రేమతోనే ఈ విజయం సాధ్యమైంది” అని విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన నటనకు వస్తున్న ప్రశంసలకు దర్శకుడు గౌతమ్ కారణమని, టీజర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ అన్నకు, అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
‘కింగ్డమ్ 2’పై ఆసక్తికర అప్డేట్స్
‘కింగ్డమ్’ విజయం పట్ల సంతోషంగా ఉన్న చిత్రబృందం, త్వరలోనే ‘కింగ్డమ్ 2’ అంటూ హింట్ కూడా ఇచ్చింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తైన తరువాతే సీక్వెల్ ప్లాన్ చేస్తామని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. మొదటి భాగం క్లైమాక్స్‌లో చూపించిన ‘సేతు’ అనే కీలక పాత్రను ఒక స్టార్ హీరో (Star Hero) పోషించనున్నారని, ఆ విషయంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని నాగవంశీ పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ తదుపరి ప్రాజెక్టులు
ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమాలో పాత్ర కోసమే ఆయన ప్రత్యేకంగా మీసం పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు దిల్ రాజు నిర్మించే “రౌడీ జనార్దన్” అనే మరో సినిమా కూడా మొదలవనుంది. దీనికి “రాజావారు రాణిగారు” ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు.
