SSMB29: రాజమౌళి-మహేష్ బాబు అభిమానులకు మళ్లీ నిరాశే.. బర్త్ డేకి కూడా..!
SSMB29: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘SSMB29’. 2027లో విడుదల కానున్న ఈ పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ప్రతీ అప్డేట్ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ అన్నీ గోప్యంగా ఉంచుతోంది.
ఆ ట్రెడిషన్‌కు స్వస్తి పలికిన రాజమౌళి!
ఈ నేపథ్యంలో, ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘SSMB29’ నుంచి ఎలాంటి టీజర్ లేదా మోషన్ పోస్టర్ విడుదల కాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సాధారణంగా హీరోల పుట్టినరోజులకు చిన్నపాటి అప్డేట్ ఇచ్చే ట్రెండ్‌కు రాజమౌళి ఈసారి స్వస్తి పలకడం గమనార్హం. ఇది రాజమౌళి తన ప్రమోషనల్ వ్యూహాలను మార్చుకున్నారని సూచిస్తోంది.
‘RRR’ ప్రపంచవ్యాప్తంగా సాధించిన అఖండ విజయం తర్వాత, రాజమౌళి దృష్టి పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్‌పైనే ఉంది. అదే దిశగా ‘SSMB29’ కూడా ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ అగ్రతార ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించి టెస్ట్ షూట్లు, కాస్ట్యూమ్, మేకప్ ట్రయల్స్, స్టంట్ కొరియోగ్రఫీ, ప్రీ-విజువలైజేషన్ వంటి పనులు జరుగుతున్నాయి. ఆస్కార్ విజేతలు, అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. రాజమౌళి తన గత చిత్రాల మాదిరిగానే, ఈ సినిమా విషయంలో కూడా స్క్రిప్ట్, టెక్నికల్ విభాగాల్లో ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తూ, అత్యున్నత స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్నారు.
‘SSMB29’ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సినిమా పట్ల ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, అభిమానుల నిరీక్షణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది 2026 ఆగస్టులో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్, లేదంటే టీజర్ విడుదల చేసి హైప్ పెంచాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ వార్త విన్న కొంతమంది అభిమానులు నిరాశ చెందుతున్నా, మరికొందరు రాజమౌళి సినిమా అంటే ఎదురుచూడక తప్పదని సర్దుకుపోతున్నారు.