War 2 Movie: ‘వార్ 2’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి భారీగా టికెట్ ధరలు.. చూడాలా వద్దా సామీ?
War 2 Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఓ సరికొత్త సమస్య తలెత్తింది. స్టార్ హీరోల సినిమాల టికెట్ ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రేక్షకులకు, ఇప్పుడు డబ్బింగ్ సినిమాల విషయంలో కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ మరియు రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ వంటి భారీ బడ్జెట్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెర్షన్ల టికెట్ ధరలు వాటి మాతృ భాషల ధరల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఈ విషయంపై నెటిజన్లు, సినీ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సినిమా, ఒకే కంటెంట్ అయినప్పటికీ భాషను బట్టి టికెట్ ధరల్లో తేడాలు చూపడం తెలుగు ప్రేక్షకులను దోచుకోవడమేనని వారు ఆరోపిస్తున్నారు. హిందీలో ‘వార్ 2’ సాధారణ ధరలకు విడుదల కానుండగా, తెలుగులో మాత్రం ధరలు పెంచడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక సినిమా టికెట్ ధర గరిష్టంగా రూ.150 నుంచి రూ.200 వరకు ఉండేది. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలకు అవి రూ.300 నుంచి రూ.400, మల్టీప్లెక్స్‌లలో రూ.500 వరకు పెరిగాయని, ఇది సాధారణ ప్రేక్షకులకు పెను భారంగా మారిందని నెటిజన్లు వాపోతున్నారు.
ధరల పెంపుపై విపరీతమైన ట్రోలింగ్..!
ప్రస్తుతం ఈ పరిస్థితిపై నెట్టింట తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. ప్రేక్షకులు సినిమా చూడటం మానేసి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడటం పెరిగే అవకాశం ఉందని, ఇది భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం ప్రజలకు కష్టంగా మారిందని, అందుకే చాలామంది థియేటర్లకు వెళ్లడం మానుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు.
ఈ సమస్యపై తెలుగు సినీ నిర్మాతలు, పంపిణీదారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ప్రేక్షకుల నుంచి మరింత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలపై తెలుగు సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.
