James Cameron: హిరోషిమా అణుదాడిని కళ్లకు కట్టినట్లు చూపించనున్న కామెరూన్
James Cameron: ‘టైటానిక్’, ‘అవతార్’ వంటి సంచలనాత్మక చిత్రాలతో ప్రపంచ సినిమా దిశను మార్చేసిన దర్శకుడు జేమ్స్ కామెరూన్, ఇప్పుడు మరో కొత్త, సవాలుతో కూడుకున్న ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ‘అవతార్’ ఫ్రాంచైజీలోని మూడు భాగాలపై దృష్టి పెట్టిన కామెరూన్, ఆ ప్రాజెక్టులతో సంబంధం లేని ఒక ప్రత్యేకమైన సినిమాను రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన హిరోషిమా అణుదాడి నేపథ్యంలో ఉంటుందని తెలిపారు. ఇది ‘టైటానిక్’ తర్వాత తాను అత్యంత ఇష్టపడి చేస్తున్న కథ అని కామెరూన్ స్వయంగా పేర్కొన్నారు.
ఈ సినిమాకు రచయిత చార్లెస్ పెల్లెగ్రినో రాసిన ‘గోస్ట్స్ ఆఫ్ హిరోషిమా’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీయనున్నారు. ఈయన ‘టైటానిక్’ కథపై కూడా కామెరూన్‌తో కలిసి పనిచేశారు. ఆగస్టు 6, 1945న అమెరికా జపాన్‌పై అణుబాంబు వేసిన రోజుతో ఈ సినిమా కథ మొదలవుతుంది. ఈ అణుదాడి 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సినిమాను ప్రకటించడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. “ఈ కథను తెరపైకి తీసుకురావడం ఒక సాహసమే,” అని కామెరూన్ అన్నారు. భావోద్వేగాలను, వాస్తవాలను, శాస్త్రీయ అంశాలను కలబోసి ఈ సినిమా ఉంటుందని ఆయన వివరించారు.
‘టైటానిక్’ సినిమా కోసం సముద్ర గర్భంలో 33 సార్లు పరిశోధన చేసినట్లుగానే, ఈ హిరోషిమా కథ కోసం కూడా అదే స్థాయిలో పరిశోధన చేస్తానని కామెరూన్ స్పష్టం చేశారు. ప్రేక్షకులను కేవలం సమాచారం అందించడం కాకుండా, వారిని కథలో లీనం చేసేలా సినిమా ఉంటుందని హామీ ఇచ్చారు. అణుదాడి చరిత్రలో ఒక విషాద అధ్యాయం. లక్షల మంది ప్రాణాలను బలిగొని, తరతరాలకు ఆరోగ్య సమస్యలను మిగిల్చిన ఈ భయంకరమైన సంఘటనను తెరపై చూపించడం కామెరూన్ ప్రధాన ఉద్దేశం. ‘అవతార్’ వంటి భారీ విజువల్ ప్రాజెక్టుల మధ్య, మానవత్వ విలువలను చాటిచెప్పే ఈ సినిమాను రూపొందించేందుకు కామెరూన్ తీసుకున్న నిర్ణయం సినీ ప్రపంచానికి కొత్త దిశానిర్దేశం చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
