Balakrishna: ‘కావాలంటే నేను సంవత్సరానికి 4 సినిమాలు చేయడానికైనా రెడీ’.. నిర్మాతలతో బాలకృష్ణ
Balakrishna: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అగ్ర కథానాయకుల మద్దతు కోరుతూ నిర్మాతల బృందం వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో చర్చించిన అనంతరం, ఈ బృందం తాజాగా నందమూరి బాలకృష్ణతో సమావేశమైంది. సినీ కార్మికుల వేతనాల పెంపు, నిర్మాణ వ్యయాల నియంత్రణ వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది.
బాలకృష్ణ కీలక సూచనలు..
నిర్మాతల భేటీ తర్వాత, నిర్మాత ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ చేసిన సూచనలను వెల్లడించారు. “పరిశ్రమలో నిర్మాతలు ఆర్థికంగా బాగుంటేనే, అందరూ బాగుంటారు” అని బాలకృష్ణ స్పష్టం చేశారని ఆయన తెలిపారు. షూటింగ్ ఖర్చులను తగ్గించడానికి కొన్ని ఆచరణాత్మక సలహాలు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. పని దినాలను తగ్గించుకోవడంతో పాటు, షూటింగ్ సమయంలో అవసరమైన సిబ్బందిని మాత్రమే తీసుకోవాలని బాలకృష్ణ సూచించారు.
ఏడాదికి నాలుగు సినిమాలు..
ఈ సందర్భంగా బాలకృష్ణ తాను తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా పంచుకున్నారు. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, నిర్మాతల ఒత్తిడిని తగ్గించడానికి తాను ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తానని అన్నట్లు ఆయన తెలిపారు. ఇది పరిశ్రమ ఆర్థిక వ్యవస్థకు, మంచి చిత్రాల నిర్మాణానికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలో అందరికీ మంచి జరిగేలా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుందామని హామీ ఇచ్చారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారని ప్రసన్న కుమార్ తెలిపారు. అటు నిర్మాతలు, ఇటు కార్మికులు.. అందరూ బాగుండేలా తాను చూసుకుంటానన్నారు.
చిరంజీవితోనూ చర్చలు..
ఇప్పటికే నిర్మాతలు చిరంజీవితోనూ చర్చలు జరిపారు. ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని, అవసరమైతే తాను జోక్యం చేసుకుంటానని చిరంజీవి వారికి హామీ ఇచ్చారు. అగ్ర కథానాయకుల మద్దతుతో సినీ పరిశ్రమలో నెలకొన్న ఈ సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమ్మెతో మాకు సంబంధం లేదు: వడ్డే కరుణాకర్ రెడ్డి
‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న సమ్మెకి, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌లో ఉన్న కార్మిక సంఘాలకు సంబంధం లేదు’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు వడ్డే కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ఈ సమ్మె మా దృష్టికి రాలేదు. మా ఛాంబర్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో అనుసంధానమై ఉంది. చలనచిత్ర నిర్మాతల మండలితోనే కలిసి పని చేస్తాం’ అని అన్నారు.