Jatadhara Teaser: విలన్‌గా సోనాక్షి సిన్హా.. సుధీర్ బాబు ‘జటాధర’ టీజర్ రిలీజ్
Jatadhara Teaser: టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘జటాధర’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ నటి సోనాక్షి సిన్హా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘జటాధర’ టీజర్ చూస్తుంటే, ఇది ఒక మైథలాజికల్, సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందినట్లు స్పష్టం అవుతోంది. ముఖ్యంగా, “శివుని జటల నుండి ప్రళయం ఉద్భవించినపుడు, అధర్మానికి అంతం ఖాయం” వంటి శక్తివంతమైన డైలాగులు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం, దాని చుట్టూ ఉన్న రహస్యాలు, పురాణ కథలు, నిధుల చుట్టూ అల్లుకున్న వివాదాల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సుధీర్ బాబు పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోందని, సోనాక్షి సిన్హా పాత్ర కూడా కథలో కీలకం అని టీజర్ సూచిస్తోంది.
జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేశ్ కె.ఆర్.భన్సాల్ మరియు ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమేష్ కెఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, రాజీవ్ అగర్వాల్, అరవింద్ అగర్వాల్, నిఖిల్ నందా, మోనేష్ మంఘ్నానితో పాటు జీ స్టూడియోస్ బ్రాండ్ వ్యాల్యూ పెంచేలా ఈ జటాధర ఉండబోతోంది.
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదుర్కొన్న సుధీర్ బాబుకు ‘జటాధర’ ఒక పెద్ద హిట్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ టీజర్‌ను విడుదల చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.