Baaghi 4 Teaser: టైగర్ ష్రాఫ్ ‘బాఘీ 4’ టీజర్ వచ్చేసింది.. విలన్‌గా మెప్పించిన సంజయ్ దత్
Baaghi 4 Teaser: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాఘీ 4’ టీజర్ విడుదలైంది. ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న నాలుగో సినిమా ఇది. సెప్టెంబర్ 5, 2025న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఎ. హర్ష దర్శకత్వం వహించారు. ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
రక్తం ఏరులై పారాల్సిందే..
‘బాఘీ’ ఫ్రాంచైజీలో చాలా వయోలెంట్ చిత్రంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఇది నిజమేననిపిస్తుంది. ముఖ్యంగా, టీజర్ ప్రారంభంలో టైగర్ ష్రాఫ్ చెప్పే “అవసరం, ప్రాముఖ్యత వేరు” అనే డైలాగ్‌తోనే సినిమా కథ ఎంత తీవ్రంగా ఉండబోతుందో ఒక అంచనాకు రావొచ్చు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటించగా, ఆయనకు వ్యతిరేకంగా టైగర్ ష్రాఫ్ చేసే యుద్ధమే ప్రధాన కథాంశం. ఈ టీజర్‌లో రక్తం, హింస, విపరీతమైన యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కేవలం హీరో మాత్రమే కాకుండా, హీరోయిన్లుగా నటించిన సోనమ్ బజ్వా, హర్నాజ్ సంధు కూడా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో కనిపించడం విశేషం.
https://x.com/taran_adarsh/status/1954811260148891874
యానిమల్, మార్క్ సినిమాలతో పోలుస్తూ..
అయితే, టీజర్‌లోని కొన్ని సన్నివేశాలపై నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాలో మాస్క్‌లు ధరించిన వ్యక్తులు నడిచే సన్నివేశాలను ఈ టీజర్ కాపీ చేసిందనే కామెంట్లు వస్తున్నాయి. అలాగే, మలయాళంలో వచ్చిన థ్రిల్లర్ ‘మార్కో’ సినిమాతో కూడా పోలికలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, టైగర్ ష్రాఫ్ అభిమానులు మాత్రం టీజర్‌పై సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇదొక ప్రామిసింగ్ టీజర్ అని, ఈ సినిమాతో టైగర్ ష్రాఫ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడని చాలా మంది అంటున్నారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత నిర్మాత సాజిద్ నడియావాలా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.
