Op Sindoor Officers in KBC: కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ఆపరేషన్ సిందూర్ మహిళా ఆఫీసర్లు..!
Op Sindoor Officers in KBC: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన మహిళా అధికారులు ఇప్పుడు టీవీ తెరపై కనిపించనున్నారు. దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రత్యేక ఎపిసోడ్‌లో అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు, యుద్ధనౌకకు కమాండ్ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారిణి, కమాండర్ ప్రేరణ డియోస్థలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నెటిజన్ల విమర్శలు ఎందుకంటే..?
తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలో, ఈ మహిళా అధికారులు ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ అనుభవాలను బిగ్‌బీతో పంచుకున్నారు. దేశానికి సేవ చేయడం పట్ల తమకున్న అంకితభావాన్ని వారు వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే, ఈ మహిళా అధికారులు టీవీ షోలో కనిపించడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్ కోసం సాయుధ దళాలను ఉపయోగిస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
https://x.com/SonyTV/status/1955101936707047713
చరిత్ర సృష్టించిన ధీర వనితలు..
ఈ మహిళా ఆఫీసర్ల నేపథ్యాలు అసాధారణమైనవి. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో పర్మనెంట్ కమిషన్‌లో చేరారు. కల్నల్ సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో ఉన్నత అధికారి. భారత సైన్యంలో ఒక ఆర్మీ కంటింజెంట్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇక, కమాండర్ ప్రేరణ డియోస్థలీ గత సంవత్సరం భారత నావికాదళంలో యుద్ధనౌకకు కమాండర్‌గా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ మహిళా అధికారులను సత్కరించేందుకు కౌన్ బనేగా కరోడ్‌పతి వేదిక కావడం విశేషం.
