Bigg Boss 9: బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లడం ఇకపై సులువేం కాదు.. ఆ అగ్నిపరీక్ష దాటాల్సిందే
Bigg Boss 9: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను గత ఎనిమిది సీజన్లుగా అలరిస్తున్న బిగ్ బాస్ షో, ఇప్పుడు తొమ్మిదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈసారి కొత్తదనం కోసం బిగ్ బాస్ టీమ్ ‘అగ్నిపరీక్ష’ అనే వినూత్నమైన కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఈ కాన్సెప్ట్ ప్రకారం, ముందుగా ఎంపిక చేసిన 42 మంది సామాన్యుల నుంచి, కేవలం ఐదుగురు మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారు. ఇప్పటికే 18 వేలకు పైగా దరఖాస్తులు రాగా, వాటి నుంచి ఎంపికైన 42 మందిని ఈ పరీక్షకు సిద్ధం చేస్తున్నారు.
అభిజిత్, బిందు, నవదీప్‌ల చేతుల్లోనే..
ఈ 42 మందిలో తుదిగా ఐదుగురిని ఎంపిక చేసే బాధ్యతను బిగ్ బాస్ గత సీజన్లలో తమదైన ముద్ర వేసిన ముగ్గురు కీలక కంటెస్టెంట్లకు అప్పగించారు. వారు ఎవరంటే… సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి, సీజన్ 1లో ప్రేక్షకులను అలరించిన నవదీప్. వీరు ఈ 42 మంది అభ్యర్థులకు ‘అగ్నిపరీక్ష’ నిర్వహించనున్నారు. ఈ కొత్త కాన్సెప్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సిరీస్‌కు సంబంధించిన ఒక చిన్న లీక్ వీడియో, ఆ తర్వాత అధికారిక ప్రోమో విడుదల కావడంతో మరింత ఉత్సాహం నెలకొంది.
ఎంట్రీ టికెట్ కోసం హోరాహోరీ
ప్రోమోలో యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ, “ఇదే మీ స్పాట్లైట్. ఇదే మీ ఎంట్రీ టికెట్. కానీ ఇది అంత తేలిక కాదు” అంటూ కొత్త అభ్యర్థులకు సవాల్ విసిరారు. మైండ్ గేమ్స్‌కు పేరుగాంచిన అభిజిత్, “నేను మైండ్ గేమ్ ఆడతానని మీకందరికీ తెలుసు. కానీ ఈసారి మైండ్ బ్లాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి” అని హెచ్చరించారు. ఇక బిందు మాధవి తన స్టైల్లో “మాస్క్ అంటేనే ఫేక్. నా ముందు ఉండేది రెండే ఆప్షన్స్, బ్లాకా?, వైటా? ఈ అగ్నిపరీక్ష అదే తేల్చేద్దాం” అని చెప్పారు. నవదీప్ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని హామీ ఇస్తూ, “ఈ అగ్నిపరీక్షలో మీ స్ట్రెస్ ఎలా తగ్గించాలో, వాళ్లదేలా పెంచాలో చూస్తాను” అని అన్నారు.
చివరగా, ఈ ముగ్గురు పాత కంటెస్టెంట్లు శ్రీముఖితో కలిసి స్క్రీన్‌పై కనిపించారు. వారి వెనుక 42 మంది కొత్త కంటెస్టెంట్స్ నిలబడి ఉన్నారు. ఈ 42 మందిలో చివరికి ఆ ఐదుగురు ఎవరు? ఈ అగ్నిపరీక్ష ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఆగస్ట్ 22 వరకు వేచి చూడాల్సిందే. ఈ ప్రత్యేక సిరీస్ జియో సినిమా, హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.
