Mrunal Thakur: బిపాషాకు క్షమాపణలు చెప్పిన మృణాల్..!
Mrunal Thakur: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత వీడియోపై నటి మృణాల్ ఠాకూర్ ఎట్టకేలకు స్పందించారు. ఆ వీడియోలో ఆమె బిపాషా బసు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో, మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆమె వివరించారు.
తెలివి తక్కువగా మాట్లాడాను.. సారీ..
“19 ఏళ్ల వయసులో నేను తెలివి తక్కువగా మాట్లాడాను. అదంతా అందం గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలు. కానీ, అవి ఇంతమందిని బాధిస్తాయని నాకు అప్పుడు అర్థం కాలేదు. అలా మాట్లాడినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. అది ఎన్నో ఏళ్ల క్రితం ఒక సరదా ఇంటర్వ్యూలో జరిగిన విషయం. అది ఇంత దూరం వస్తుందని నేను ఊహించలేదు. నిజానికి, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని ఇప్పుడు అనిపిస్తోంది. కాలం గడిచేకొద్దీ అందానికి అసలైన నిర్వచనం నాకు అర్థమైంది. అది ఎంతో విలువైనది. మనసుతో చూస్తే ప్రతి దానిలోనూ సౌందర్యం కనిపిస్తుంది.”
అసలేం జరిగిందంటే..?
కొన్ని సంవత్సరాల క్రితం, ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ, బిపాషా బసు కంటే తాను చాలా అందంగా ఉంటానని, ఆమె “కండలు తిరిగిన పురుషుడిలా” కనిపిస్తారని వ్యాఖ్యానించారు. బిపాషాతో పోలిస్తే తాను ఎన్నో రెట్లు అందగత్తెనని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి. దీనిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు మృణాల్ మాటలను ఖండించారు.
ఈ వివాదంపై బిపాషా బసు కూడా పరోక్షంగా స్పందించారు. మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, బలహీనంగా కనిపించాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు. అమ్మాయిలు శారీరకంగా బలంగా ఉండకూడదనే పాత ఆలోచనల నుంచి బయటకు రావాలని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. బిపాషా ఈ విధంగా కౌంటర్ ఇవ్వడంతో, మృణాల్ తన పాత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పారు.