Nani: వార్2, కూలీ కోసం నాని కొత్త అవతారం.. అదేంటో మీరే చూసేయండి!
Nani: ఈ వారం బాక్సాఫీస్ వద్ద రెండు భారీ చిత్రాలు పోటీపడ్డాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్ 2’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సందడిలో సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా థియేటర్లలో సందడి చేశారు. ఈ క్రమంలో, ప్రముఖ నటుడు నాని హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ థియేటర్‌కు వెళ్లి రెండు చిత్రాలను వీక్షించారు.
లుక్ బయటకు రావొద్దని ముసుగు..
అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే, నాని తన ముఖాన్ని పూర్తిగా మాస్క్‌తో కప్పుకొని థియేటర్‌కు వెళ్లారు. దీనికి ప్రధాన కారణం.. తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ కోసం రూపొందించిన కొత్త లుక్‌ను బయటపెట్టకుండా ఉండటానికేనని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు..
నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. గతంలో ‘పక్కింటి కుర్రాడి’ పాత్రలతో అలరించిన నాని, ఈసారి పూర్తి వైలెంట్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన సినిమా మేకింగ్ వీడియో అంచనాలను మరింత పెంచింది. ఈ కొత్త లుక్, మేకింగ్ చూస్తుంటే నాని ఈ చిత్రంతో ‘టైర్ 1’ హీరోల జాబితాలో చేరిపోతారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రెండు పొడవాటి జడలు వేసుకుని రగ్గుడ్ లుక్ లో నాని అదరగొట్టాడు. పోస్టర్ చూస్తుంటేనే హడల్ పుట్టించేలా ఉన్నాడు నాని. నేచురల్ స్టార్ కాస్త మోస్ట్ వైలెంట్ స్టార్ గా మారిపోయాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో ఒక ఇంటర్వ్యూలో నాని లుక్ వెనుక ఒక భావోద్వేగమైన కథ ఉందని చెప్పిన విషయం తెలిసిందే. తన చిన్నతనంలో తల్లి తనకు అలాగే జడలు వేసేదని, ఆ జ్ఞాపకం కథకు ఎలా ముడిపడి ఉందో త్వరలో తెలుస్తుందని అన్నారు.
దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 26, 2026న విడుదల కానుంది. నాని ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.