Robot Games: రోబోలకు కూడా ఒలింపిక్స్.. చైనాలో తొలి ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్
Robot Games: మానవ ప్రపంచంలో మాత్రమే కాదు, మర మనుషుల (హ్యూమనాయిడ్ రోబోలు) ప్రపంచంలో కూడా క్రీడలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా చైనా రాజధాని బీజింగ్ వేదికగా వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ (The World Humanoid Robot Games) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ తరహాలో నిర్వహించిన ఈ క్రీడల్లో 16 దేశాలకు చెందిన దాదాపు 280 బృందాలు పాల్గొన్నాయి.
ఈ వినూత్నమైన క్రీడా ఉత్సవం బీజింగ్‌లోని ది నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్ లో జరుగుతోంది. ఇందులో రోబోలు ఫుట్‌బాల్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, ట్రాక్ అండ్ ఫీల్డ్ వంటి క్రీడా విభాగాలతో పాటు, ఔషధాలను గుర్తించడం, వస్తువులను తీసుకెళ్లడం, శుభ్రత వంటి విభాగాల్లో కూడా పోటీపడ్డాయి. ఈ పోటీల ద్వారా రోబోల సామర్థ్యం, వాటి బలం, వేగం, ఖచ్చితత్వాన్ని అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన..
ఈ రోబో ఒలింపిక్స్‌కు అంతర్జాతీయంగా భారీ స్పందన లభించింది. అమెరికా, జర్మనీ, బ్రెజిల్, జపాన్ వంటి దేశాల నుంచి 192 విశ్వవిద్యాలయాలు, 88 ప్రైవేటు సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. చైనా నుంచి కూడా యూనిట్రీ, ఫోరియర్ వంటి ప్రముఖ సంస్థలు పోటీలో ఉన్నాయి. బీజింగ్ మున్సిపల్ గవర్నమెంట్ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. ఇది బీజింగ్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంగా నిలుస్తోంది.
https://x.com/gunsnrosesgirl3/status/1942467132056363369
చైనా లక్ష్యం ఏంటంటే..
గత సంవత్సరంలో చైనా AI, రోబోటిక్స్ రంగాల అభివృద్ధికి దాదాపు $20 బిలియన్లు ఖర్చు చేసింది. భవిష్యత్తులో AI, రోబోటిక్ స్టార్టప్‌లకు మద్దతుగా $137 బిలియన్ల నిధిని ఏర్పాటు చేయాలని చైనా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను సాధించే క్రమంలోనే ఇలాంటి రోబోటిక్ ఈవెంట్‌లను భారీ ఎత్తున నిర్వహిస్తోంది. గతంలో కూడా హ్యూమనాయిడ్ రోబోల కోసం మారథాన్ రేసును బీజింగ్ నిర్వహించింది. అయితే, ఆ పోటీలో పాల్గొన్న చాలా రోబోలు రేసు పూర్తి కాకముందే దెబ్బతిన్నాయి. ఈ కొత్త ఒలింపిక్స్ మాత్రం రోబోల సామర్థ్యానికి మరోసారి పరీక్షగా నిలుస్తున్నాయి.