Raakh Web Series: ‘పాతాళ్ లోక్’ దర్శకుడి డైరెక్షన్లో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..
Raakh Web Series: ప్రేక్షకులను ఆకట్టుకునే సరికొత్త కథాంశాలతో ముందుకు వస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇప్పుడు మరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్‌ను ప్రకటించింది. ‘మీర్జాపూర్’ సిరీస్‌తో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్‌కు ‘రాఖ్’ అని పేరు పెట్టారు. ఇందులో సోనాలి బింద్రే, అమీర్ బషీర్ వంటి ప్రముఖులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ వెబ్‌సిరీస్‌కు ‘పాతాళ్ లోక్’ ఫేమ్ దర్శకుడు ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు అనూష నందకుమార్, సందీప్ సాకేత్‌లు కూడా దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో ‘రాఖ్’ విడుదల కానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘బూడిద నుంచి న్యాయం బయటకు వస్తుంది’ (Justice will rise from the ashes) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచింది.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రొసిత్ రాయ్ ఈ ప్రాజెక్ట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. దర్శకులు నందకుమార్, సాకేత్‌ల విజన్‌ను ప్రశంసిస్తూ, ఈ సిరీస్‌లో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా కథ, కథనాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. న్యాయం, నైతికత అనే ప్రశ్నార్థకమైన అంశాలను ఈ సిరీస్‌లో చూపించబోతున్నాం అని పేర్కొన్నారు. భారతీయ కథా ప్రపంచంలో ఇలాంటి భిన్నమైన, లోతైన పాత్రలతో కథను తెరకెక్కించడం ఒక సాహసవంతమైన అడుగు అని ప్రొసిత్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులు ఒక శక్తివంతమైన కథను చూడబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పాతాళ్ లోక్ సిరీస్‌లో.. హథీరామ్ చౌదరి (జైదీప్ అహ్లవత్) అదే పార్ జుమునాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆఫీసర్‌గా కొనసాగుతూ ఉంటాడు. అతడి జూనియర్‌గా చేరిన ఇమ్రాన్ అన్సారీ (ఇష్వాక్ సింగ్) సివిల్స్ పాసై ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. నిత్యం ఆందోళనలతో అట్టుడికిపోతున్న నాగాలాండ్‌లో శాంతి స్థాపన చేసి, అభివృద్ధి పనులు చేపట్టాలని కొంతమంది నాగాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసమని దిల్లీ వస్తారు.
అలా వచ్చిన వారిలో కీలక వ్యక్తి అయిన జొనాథన్ థామ్ (కగురోంగ్ గోన్మీ)ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేస్తారు. ఈ కేసు విచారించే బాధ్యతను యువ ఐపీఎస్ అయిన ఇమ్రాన్ అన్సారీకి పోలీస్‌శాఖ అప్పగిస్తుంది. మరి హథీరామ్ చౌదరి ఈ కేసు విచారణలోకి ఎలా వచ్చాడు? థామ్ హత్య వెనక ఎవరున్నారు?(paatal lok season 2 review) ఇమ్రాన్‌తో కలిసి హథీరామ్ నాగాలాండ్ వెళ్లిన తర్వాత అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నదే ఈ సిరీస్.