సంక్షేమ పథకాలకు పెట్టిన పేరైన దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదగడానికి పేదవాడి గుండె చప్పుడు తెలుసుకోవడానికి తండ్రి బాటలో పాదయాత్ర చేసి 2019 సార్వత్రిక ఎన్నికలలో విశేషమైన ప్రజల మద్దతుతో చారిత్రక విజయం సాధించారు.
పాదయాత్రలో పేద ప్రజల కష్టాలను వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అతి దగ్గరగా చూసిన అనుభవంతో అధికారంలోకి వచ్చిన నాటినుండీ తండ్రిని మించిన తనయుడుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
ఇసుక మద్యం పాలసీల వలన ఎదురవుతున్న వ్యతిరేకతను నవరత్నాల అమలు ద్వారా సమర్థంగా ఎదుర్కొంటున్నారు.
రాజకీయాల్లో ప్రతి చోట వ్యతిరేకించే వారు ఉంటారు. అలాగే తన అభిమాన నేతను ప్రాణంగా ప్రేమించే వారు ఉంటారు. అలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం లోని రాజు పాలెం గ్రామంలో ఆయనకు గుడి కట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాజుపాలెం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుడు కురుకూరి నాగేశ్వరరావు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ నెలలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేతుల మీదుగా భూమి పూజ చేసి గుడి నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.
అభిమాన నేతను ప్రేమిస్తూ గుడి కట్టడం లో తప్పులేదు అలానే కాలక్రమంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఈనాడు గుడి కడుతున్న వారి స్పందన నాడు ఎలా ఉంటుందో వేచి చూడాలి.