Mega 157: మెగా157 టైటిల్ అదేనా.. అనిల్ రావిపూడి ఏం చెప్పాడంటే..?
Mega 157: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 157’ చిత్రంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, అనిల్ రావిపూడి తాజాగా ఒక సినిమా ఈవెంట్‌లో అభిమానుల ఎదురుచూపులకు తెరదించారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 21న సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, నటుడు మౌలి తనుజ్ ప్రశాంత్, యాంకర్లు సరదాగా ‘మెగా 157’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కొన్ని ఊహాజనిత టైటిళ్లను ప్రస్తావించారు. ‘సంక్రాంతికి క్రొకడైల్ ఫెస్టివల్’, ‘సంక్రాంతికి రఫాడిస్తా’ వంటి టైటిల్స్‌ను విని అనిల్ రావిపూడి కాస్త అసహనం వ్యక్తం చేశారు. “వాటికి మా సినిమా టైటిల్‌కి ఏమాత్రం సంబంధం లేదు, అసలు అలాంటి పోలికే లేదు” అని స్పష్టం చేశారు. అనంతరం, ఆగస్టు 21న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటన ఉంటుందా అని యాంకర్ అడిగినప్పుడు, “అవును, అదే నిజం” అని ధృవీకరించారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె కొణిదెల సుష్మిత కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ఒక వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్. వెంకటేశ్ అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ‘ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం’, ‘బాస్‌తో ఈ పండగ రఫ్ఫాడిస్తాం’, ‘మన శివ శంకర వరప్రసాద్ గారు’.. వీటిలో ఒకటి టైటిల్ అని చిత్ర బృందం ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో హింట్ ఇచ్చింది. పేరులో సంక్రాంతి లేదని అనిల్ రావిపూడి ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్‌ని బట్టి.. చిరంజీవి అసలు పేరు (శివ శంకర వరప్రసాద్)తో ముడిపడిన టైటిల్‌నే ఖరారు చేశారని అర్థమవుతోంది.
