Janhvi Kapoor: నేను మలయాళీ కాదు కానీ.. ట్రోల్స్‌పై స్పందించిన జాన్వీ కపూర్
Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తాజా చిత్రం ‘పరమ్ సుందరి’లో మలయాళ యువతిగా నటించడంపై ఎదురైన విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత, ఉత్తరాదికి చెందిన జాన్వీని కేరళ అమ్మాయిగా చూపించడంపై పలువురు నెటిజన్లు, ముఖ్యంగా మలయాళ పరిశ్రమకు చెందిన వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేరళలో హీరోయిన్లు లేరా అంటూ గాయని పవిత్ర మేనన్ వంటి వారు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై జాన్వీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.
“నిజమే, నేను మలయాళీ అమ్మాయిని కాదు. మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు. కానీ, నాకు కేరళ సంస్కృతి అంటే ఎంతో ఇష్టం. నేను మలయాళ సినిమాలకు పెద్ద అభిమానిని,” అని జాన్వీ స్పష్టం చేశారు. ఈ సినిమా ఒక వినోదాత్మక కథ అని, ఇందులో తాను మలయాళ అమ్మాయిగానే కాకుండా తమిళ యువతిగా కూడా కనిపిస్తానని ఆమె తెలిపారు. ఇలాంటి ఒక విభిన్నమైన సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు.
కేరళ యువతి, ఢిల్లీ అబ్బాయి ప్రేమకథ
‘పరమ్ సుందరి’ ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇందులో కేరళకు చెందిన యువతి, ఢిల్లీకి చెందిన యువకుడి మధ్య నడిచే ప్రేమకథను చూపించనున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ సుందరి దామోదరన్ పిళ్లై పాత్రలో, సిద్దార్థ్ మల్హోత్రా పరం సచ్‌దేవ్ పాత్రలో నటించారు.
ఈనెల 29నే ప్రేక్షకుల ముందుకు..
తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌లో “కేరళ-మలయాళం మోహన్ లాల్, తమిళనాడు-తమిళం రజనీకాంత్, ఆంధ్ర-తెలుగు అల్లు అర్జున్, కర్ణాటక-కన్నడ యష్” అంటూ జాన్వీ చెప్పిన డైలాగ్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.