Rajinikanth: నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా.. ఊపందుకున్న ఊహాగానాలు
Rajinikanth: ‘కల్కి 2898 ఏడీ’తో దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ తన తదుపరి చిత్రం గురించి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పటివరకు ‘కల్కి’కి సీక్వెల్‌గా మరో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ మరో కథను సిద్ధం చేసుకున్నారని, అది ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తోనని తెలుగు, తమిళ సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఈ వార్తల ప్రకారం, నాగ్ అశ్విన్ ఇటీవల రజనీకాంత్‌ను కలిసి ఒక కథను వినిపించారని, ఆ కథ రజనీకి నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని సూచించారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ‘కల్కి’ని నిర్మించిన వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించే అవకాశం ఉందని కూడా సమాచారం. ఈ వార్త కనుక నిజమైతే, నాగ్ అశ్విన్ వరుసగా ఇద్దరు అగ్ర నటులు కమల్ హాసన్, రజనీకాంత్‌లతో సినిమాలు చేసిన ఘనతను సొంతం చేసుకుంటారు. ‘కల్కి 2898 ఏడీ’లో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
మరోవైపు, రజనీకాంత్ ప్రస్తుతం జైలర్-2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత కమల్ హాసన్‌తో కలిసి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయ్యాక రజనీకాంత్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే పలువురు యువ దర్శకులు రజనీకాంత్‌కు కథలు వినిపించినప్పటికీ అవి ఫలించలేదు. బింబిసార దర్శకుడు వశిష్ట, వివేక్ ఆత్రేయ వంటి వారు కూడా రజనీని కలిశారు. అయితే, నాగ్ అశ్విన్ విజయం రజనీకాంత్‌ను ప్రభావితం చేసిందని, అందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి స్పష్టత వస్తుంది.