Mirai Trailer: ‘మిరాయ్’ ట్రైలర్ విడుదల.. అంచనాలను అమాంతం పెంచేసిన తేజ సజ్జా మూవీ
Mirai Trailer: యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా తాజా చిత్రం ‘మిరాయ్’ (Mirai) నుంచి ఉత్కంఠభరితమైన ట్రైలర్ విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచుకోగా, ఈ ట్రైలర్ వాటిని మరింత పెంచింది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్రంలో తేజ సజ్జా సరసన హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు.
సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ‘ఈ ప్రమాదం ప్రతీ గ్రంథాన్ని చేరబోతోంది’ అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమై, ఒక విజువల్ వండర్‌లా కొనసాగింది. డ్రాగన్‌తో హీరో చేసే పోరాట సన్నివేశాలు, ‘దునియాలో ఏదీ నీది కాదు..’ వంటి డైలాగులు సినిమా కథా నేపథ్యాన్ని సూచిస్తున్నాయి. అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ సెట్స్, అలాగే ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే నిర్మాణ విలువలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మార్క్ కె. రాబిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత బలాన్ని చేకూర్చింది.
మొత్తంగా, ఈ ట్రైలర్ ‘మిరాయ్’ ఒక హై-ఆక్టేన్ యాక్షన్, ఫాంటసీ థ్రిల్లర్ అని స్పష్టంగా చెబుతోంది. తేజ సజ్జా తన గత చిత్రాలతో సాధించిన విజయాలతో పాటు ఈ సినిమాతో కూడా మరో పెద్ద హిట్ అందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
