Dragon: ఎన్టీఆర్-నీల్ ‘డ్రాగన్’ మూవీలో కన్ఫర్మ్ అయిన హీరోయిన్.. ఎవరంటే?
Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘డ్రాగన్’ (NTR31)పై అభిమానుల ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు, అప్డేట్స్ ప్రచారం అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.
మదరాసి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో..
తాజాగా శివకార్తికేయన్ హీరోగా ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘మదరాసి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, రుక్మిణీ వసంత్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “‘మదరాసి’లో రుక్మిణీని ఎంపిక చేసినప్పుడు ఆమె కొత్త హీరోయిన్. కానీ, ఇప్పుడు ఆమె చాలా బిజీగా ఉంది. ఆమె ‘కాంతార 2’, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అలాగే ‘టాక్సిక్’లో హీరోయిన్గా నటిస్తోంది,” అని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పక్కన రుక్మిణీ వసంత్ నటిస్తున్నారనే విషయంపై అధికారికంగా స్పష్టత వచ్చింది.
‘డ్రాగన్’పై భారీ అంచనాలు..
కేజీఎఫ్, సలార్ వంటి భారీ విజయాల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ వంటి స్టార్‌తో సినిమా చేస్తుండడంతో ‘డ్రాగన్’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇటీవల కర్ణాటకలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం, త్వరలో హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు కూడా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
గతంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలను అందుకున్న ప్రశాంత్ నీల్, డ్రాగన్ మూవీ తన కలల ప్రాజెక్ట్ గా పేర్కొన్నారు. ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన వర్గాలు, “ప్రశాంత్ నీల్ తన కెరీర్లోనే ఇది అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అని భావిస్తున్నారు. గతంలో ఆయన రూపొందించిన కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాల కంటే కూడా దీని స్కేల్ చాలా పెద్దది” అని పేర్కొన్నాయి.
