Sandeep Reddy Vanga: బాహుబలి 2 చూసి భయపడ్డా.. నాటి సంగతులు పంచుకున్న సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక టీవీ టాక్ షోలో పాల్గొని తన కెరీర్, సినిమాలు, రామ్ గోపాల్ వర్మతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో ఆయనతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా అతిథిగా వచ్చారు. ఈ షో ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
సందీప్ తన గురువుగా భావించే రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ, ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు. ముఖ్యంగా ‘సత్య’ సినిమాను దాదాపు 50, 60 సార్లు చూశానని, ఆ సినిమా చూసే ఎడిటింగ్ నైపుణ్యాలు నేర్చుకున్నానని వెల్లడించారు.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ సన్నివేశం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని సందీప్ తెలిపారు. ఆ సీన్ చూసిన తర్వాత తనకు భయం వేసిందని చెప్పారు. ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ అంత గొప్పగా ఉంటే, తాను తీస్తున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఇంటర్వెల్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అని కంగారు పడ్డానని అన్నారు. రాజమౌళి సినిమాలకు ఇంటర్వెల్ కూడా హైలైట్‌గా ఉంటుందని నిరూపించారని ప్రశంసించారు. అయితే ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత తనలో ధైర్యం వచ్చిందని వివరించారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమా గురించి కూడా సందీప్ కొన్ని విషయాలు పంచుకున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సిద్ధం చేసుకోవడం వల్ల చాలా సమయం ఆదా అవుతుందని చెప్పారు. ‘యానిమల్’ సినిమాకు 80 శాతం సంగీత పనులు ముందే పూర్తి చేసుకున్నామని.. ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమాకు కూడా అదే పద్ధతిని పాటిస్తున్నామని అన్నారు.
అలాగే ఇప్పటికే 70 శాతం మ్యూజిక్ వర్క్ పూర్తయిందని చెప్పారు. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని, పెద్ద స్టార్ కాబట్టి వర్క్ చేయడం ఎలా ఉంటుందో అనుకున్నానని, కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని అర్థమైందని అన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని, అప్పుడు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తానని సందీప్ వంగా తెలిపారు.