Ramana Gogula: ఉస్తాద్ భగత్ సింగ్‌లోకి రమణ గోగుల..!
Ramana Gogula: టాలీవుడ్‌లో ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ కాంబినేషన్‌లలో ఒకటిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రమణ గోగుల జోడీకి ప్రత్యేక స్థానం ఉంది. ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘అన్నవరం’ వంటి చిత్రాలకు రమణ గోగుల అందించిన సంగీతం ఇప్పటికీ యువతను ఉర్రూతలూగిస్తుంది.
‘వయ్యారి భామ నీ హంస నడక’, ‘ఏమమ్మా ఏమమ్మా’, ‘మేడిన్ ఆంధ్రా స్టూడెంట్’ వంటి పాటలు ఎప్పటికీ నిలిచిపోయే హిట్స్‌గా నిలిచాయి. చివరగా ఈ ఇద్దరి కలయికలో ‘అన్నవరం’ చిత్రం వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తోంది. ఇప్పుడు, ఈ క్రేజీ కాంబో మరోసారి కలిసి పనిచేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత, హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో రమణ గోగుల ఒక పాట పాడనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నా, ఈ వార్త అటు అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఉత్సాహంలో నింపుతోంది.
ఒకవేపు డీఎస్పీ అద్భుతమైన మ్యూజిక్, మరోవైపు రమణ గోగుల ఐకానిక్ వాయిస్.. ఈ రెండూ కలిస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆడియో బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఈ పాట వెండితెరపై మరింత అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నారు.