Janhvi Kapoor: జాన్వీ కపూర్ చాలా గ్రేట్.. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు.. ఎందుకంటే?
Janhvi Kapoor: బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్న నటి జాన్వీ కపూర్, ఇప్పుడు తన వృత్తిపరమైన విధానంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణంగా సినీ పరిశ్రమలో ప్రముఖ తారలు షూటింగ్ కోసం వెళ్లినప్పుడు వారి ప్రయాణ, వసతి, సిబ్బంది ఖర్చులను నిర్మాతలే భరించడం ఒక ఆనవాయితీగా మారింది. అయితే ఈ విషయంలో జాన్వీ కపూర్ విభిన్నంగా వ్యవహరిస్తున్నారని, తన ఖర్చులన్నీ తానే చూసుకుంటారని ఆమె బాబాయ్, ప్రముఖ నటుడు అనిల్ కపూర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
అనిల్ కపూర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో ఒక స్టార్ హీరోయిన్ షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్లినా, ఆమెతో పాటు ఆమె సిబ్బంది, మేనేజర్లు, సహాయకుల ఖర్చులన్నీ నిర్మాతలే భరిస్తారు. దీంతో నిర్మాణ వ్యయం అదనంగా పెరుగుతుంది. కానీ, జాన్వీ కపూర్ విషయంలో ఇది వర్తించదని అనిల్ కపూర్ తెలిపారు. “జాన్వీ షూటింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఫ్లైట్ టికెట్లు, హోటల్ ఖర్చులు, తనతో వచ్చే సిబ్బంది ఖర్చులు అన్నీ స్వయంగా తానే చూసుకుంటుంది. నిర్మాతలపై ఎలాంటి ఆర్థిక భారం మోపదు. ఆమె స్వతంత్రంగా, నిర్మాతల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరిస్తుంది” అని అనిల్ కపూర్ పేర్కొన్నారు.
పరిశ్రమలో ప్రశంసలు
అనిల్ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు జాన్వీ కపూర్ ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించాయి. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా భారీ బడ్జెట్‌ను నిర్మాతలపై మోపే తారల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో, జాన్వీ లాంటి అగ్రశ్రేణి నటి స్వయంగా తన ఖర్చులను భరించడం నిజంగా అభినందనీయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. జాన్వీని చూసి ఇతర హీరోయిన్స్ కూడా ఈ పద్ధతిని పాటిస్తే, సినీ పరిశ్రమకు ఎంతగానో మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు.
