Little Hearts: ‘లిటిల్ హార్ట్స్’ మూవీకి ఫిదా అవుతున్న సినీ ప్రముఖులు.. సోషల్ మీడియాలో ప్రశంసలు
Little Hearts: ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందిస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్, ఇప్పుడు తమ తొలి థియేట్రికల్ సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో విజయపథంలో దూసుకుపోతోంది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్, థియేటర్లలో నవ్వుల పూలు పూయిస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఈ సినిమాలో మౌళి తనుజ్, శివాని నాగారం ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలోని హాస్యం, కథనం యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
‘లిటిల్ హార్ట్స్’ విడుదలైనప్పటి నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా, స్టార్ హీరో నాని, దర్శకుడు సాయి రాజేశ్, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్ వంటి వారు ఈ సినిమాను చూసి ఫిదా అయ్యారు. వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
నాని మాట్లాడుతూ, “లిటిల్ హార్ట్స్ సినిమా మొత్తం ఎంతో సరదాగా సాగిందిని, చాలాకాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నా”నని తెలిపారు. చిత్రబృందానికి కాంగ్రాట్స్ చెప్పారు. సాయి రాజేశ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “కంటెంట్ ఎప్పుడూ కింగ్ అని మరోసారి ఈ సినిమా నిరూపించిందని” చెప్పారు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని, ప్రతి ఐదు నిమిషాలకు నవ్వు ఆగదని ప్రశంసించారు. అలాగే, యువ దర్శకుడు అభిషన్ జీవింత్ “లిటిల్ హార్ట్స్”ని “స్నేహితులు, కుటుంబంతో కలిసి చూడాల్సిన అద్భుతమైన సినిమా” అని పేర్కొన్నారు.
‘లిటిల్ హార్ట్స్’ సినిమా ప్రేక్షకులను మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమ ప్రముఖులను కూడా ఆకట్టుకోవడం ఈ చిత్రానికి లభించిన మంచి మార్కుగా చెప్పవచ్చు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతూ బయటకు వస్తున్నారని, ఇది చిత్ర యూనిట్ కు గొప్ప ప్రోత్సాహం అని అంటున్నారు.