Siva Karthikeyan: తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు ఎందుకు రావట్లేదు.. అదే కారణంటున్న శివకార్తికేయన్
Siva Karthikeyan: ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయన్, ఇటీవల తన సినిమా ‘మదరాసి’ విజయవంతమైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తమిళ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు బాలీవుడ్‌తో పాటు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల సినిమాలు మాత్రమే ₹1000 కోట్లకు చేరుకోగా, తమిళ చిత్రాలు ఈ మైలురాయిని ఇంకా చేరుకోలేదు. దీనిపై ఆయన ఆసక్తికరమైన విశ్లేషణను అందించారు.
“తమిళ సినిమాకు వెయ్యి కోట్లు సాధించడం పెద్ద కష్టం కాదు, త్వరలోనే ఆ లక్ష్యాన్ని సాధిస్తాం,” అని శివకార్తికేయన్ ధీమా వ్యక్తం చేశారు. తమిళ చిత్రాలు ఈ ఘనత సాధించకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మొదటిది, చాలా తమిళ సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో విడుదల కాకపోవడం. ఒకవేళ విడుదలైనా వాటికి ఉత్తర భారతదేశంలో మంచి స్పందన లభించకపోవడం. రెండోది, సినిమా టికెట్ల ధరలు.
బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలతో పోలిస్తే తమిళనాడులో టికెట్ ధరలు తక్కువగా ఉంటాయని శివకార్తికేయన్ పేర్కొన్నారు. “ఒకవేళ తమిళనాడులో కూడా టికెట్ ధరలు ఎక్కువగా ఉండి ఉంటే రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఎప్పుడో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి ఉండేది,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం టికెట్ ధరలు పెంచడం తన ఉద్దేశం కాదని, ఒక సినిమా నిజంగా పెద్ద విజయం సాధించాలంటే ఉత్తర భారత ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని శివకార్తికేయన్ అన్నారు. తమిళ చిత్రాలు పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందితే, భారీ కలెక్షన్లు సాధించడం ఖాయమని ఆయన నొక్కి చెప్పారు. శివకార్తికేయన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
“టాలీవుడ్ నిర్మాతలు కంటెంట్ విషయంలో ఎప్పుడూ రాజీపడరు. ఒక కథ వారికి నచ్చితే, దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అందుకే తెలుగు సినిమాలు తరచుగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయి,” అని శివకార్తికేయన్ అన్నారు. చిరంజీవి, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలతో పనిచేసిన మురుగదాస్ దర్శకత్వంలో నటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “నా ప్రాణ స్నేహితుడు అనిరుధ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించాడు. ఆయన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. అనిరుధ్ సంగీతం అందిస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్టే,” అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత ప్రసాద్ గురించి మాట్లాడుతూ, ఆయన గొప్ప నిర్మాత అని, కంటెంట్‌ను నమ్మితే ఖర్చుకు వెనకాడరని ప్రశంసించారు.
