Rangeela Re Release: ‘రంగీలా’ రీ-రిలీజ్.. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్‌పై ఆర్జీవీ ఏమన్నారంటే..?
Rangeela Re Release: రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘రంగీలా’ చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాను 4K వెర్షన్లో రీ-రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘అల్ట్రా మీడియా’ నిర్మాణ సంస్థ ఈ రీ-రిలీజ్‌ను పర్యవేక్షించనుంది. అక్టోబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ఆమిర్ ఖాన్, ఊర్మిళా మాతోండ్కర్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం. ఈ సినిమాతోనే రెహమాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా ‘రంగీలా రే’ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా కథాకథనాలు, పాటలు, ఊర్మిళ అందం, డ్యాన్స్ అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను రామ్‌గోపాల్ వర్మ పంచుకున్నారు. మొదట ఈ సినిమాను చిరంజీవి, రజనీకాంత్‌లతో తెరకెక్కించాలని నిర్మాత అశ్వనీదత్ అనుకున్నారని, అయితే అది సాధ్యం కాకపోవడంతో ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్‌లతో ఈ సినిమా తీసినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఆర్జీవీ తన కాలేజీ రోజుల్లో జరిగిన బ్రేకప్ స్టోరీ ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పారు.
నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు 33 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలోని నటనకు గాను జాకీ ష్రాఫ్ ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’ అవార్డును, రెహమాన్ ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’ అవార్డును దక్కించుకున్నారు. మొత్తం ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఈ చిత్రం గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
