OG Movie: ‘ఓజీ’ ప్రమోషన్లకు దూరంగా పవన్.. అసలు కారణం ఇదేనా..?
OG Movie: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ (OG) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు ఉన్న భారీ హైప్ దృష్ట్యా, పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో, తాను నేరుగా ప్రమోషన్లలో పాల్గొంటే అభిమానుల అంచనాలు హద్దులు దాటిపోయే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది సినిమాకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని, గతంలో హరిహర వీరమల్లు చిత్రానికి ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ సినిమాలో పవన్ కల్యాణ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొనడంతో అభిమానుల అంచనాలు పెరిగి, సినిమాకు ప్రతికూల టాక్ రావడానికి దారితీసిందని విశ్లేషిస్తున్నారు.
ఈసారి ఓజీ విషయంలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా, అంచనాలను పెంచి సినిమాకు నష్టం కలిగించకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కేవలం సినిమా అప్డేట్లు, ట్రైలర్ వంటి ప్రచార కార్యక్రమాలకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా తన రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉండటం కూడా ఈ నిర్ణయానికి మరో కారణమని భావిస్తున్నారు.
ఓజీ చిత్రానికి ఇప్పటికే కావాల్సినంత హైప్, బజ్ ఉన్నాయి. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రచారం లేకుండానే సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో అంచనాలను మరింత పెంచకుండా, సినిమా కంటెంట్ స్వయంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూడాలని పవన్ కల్యాణ్ టీమ్ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.