Anushka Shetty: తీవ్రంగా నిరాశపరిచిన ‘ఘాటి’.. ఫ్యాన్స్‌కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న స్వీటీ.. ఏంటంటే?
Anushka Shetty: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘అరుంధతి’, ‘బాహుబలి’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. ఇటీవల ఆమె నటించిన ‘ఘాటి’ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో థియేటర్ల నుంచి తొలగించారు.
ఈ నేపథ్యంలో, అనుష్క సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ పెడుతూ, “నీలి వెలుగును దీపకాంతిగా మార్చుకుంటూ… సరైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రపంచంతో మళ్లీ కలిసిపోవడానికి కొంతకాలం సోషల్ మీడియా నుండి దూరంగా ఉండబోతున్నాను. త్వరలోనే మరిన్ని కథలతో, మరింత ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఆమె అభిమానులను కలవరపెట్టింది.
‘ఘాటి’ చిత్రంలో అనుష్క ‘శీలావతి’ పాత్రలో నటించినప్పటికీ, సినిమాలోని కథా లోపాలు, నెమ్మదిగా సాగే కథనం సినిమా వైఫల్యానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ సినిమా అనుష్క చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో నటించినది కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఫెయిల్ అవ్వడంతో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అనుష్క తీసుకున్న ఈ నిర్ణయం సినిమా వైఫల్యం వల్ల తీసుకున్నదే అని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ విరామం ఆమెకు తన కెరీర్, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. ఆమె పోస్టులో “త్వరలోనే మరిన్ని కథలతో మీ ముందుకొస్తాను” అని చెప్పడం, ఆమె మరోసారి శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సంకేతాలు ఇస్తోంది.
