Kantara Chapter 1: ఓటీటీ డీల్‌తో సినిమా బడ్జెట్ వచ్చేసింది.. కాంతార క్రేజ్ మామూలుగా లేదుగా..
Kantara Chapter 1: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయిలో ఒక సంచలనంగా మార్చిన చిత్రం ‘కాంతార’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ అద్భుతమైన విజయం తర్వాత, మేకర్స్ ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) ప్రీక్వెల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 30 దేశాల్లో, ఏడు భాషల్లో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఇంగ్లీష్, బెంగాలీ భాషలను కూడా జాబితాలో చేర్చారు. ఇప్పటికే వివిధ భాషల్లో డిస్ట్రిబ్యూటర్ వివరాలను చిత్రబృందం వెల్లడించింది. అయితే, కేరళలో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో సమస్యలు తలెత్తడంతో అక్కడ విడుదలపై కొంత సందిగ్ధత నెలకొంది.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా, చిత్రబృందం పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్‌తో ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి కూడా దిల్జిత్తో ప్రమోషనల్ సాంగ్ చేయించిన విషయం తెలిసిందే. ఈ పాట కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది.
మరోవైపు, ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ. 125 కోట్ల భారీ మొత్తంతో ఈ హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. మొదటి ‘కాంతార’ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి వెనకడుగు వేసిన ఓటీటీ సంస్థలు, ఇప్పుడు ఇంత భారీ రేటు చెల్లించడం నిజంగా రిషబ్ శెట్టి కష్టానికి దక్కిన ప్రతిఫలమని సినీ వర్గాలు చెబుతున్నాయి.