Jailer 2: జైలర్ మూవీపై హైప్ తగ్గించేందుకు డైరెక్టర్ నెల్సన్ కష్టాలు.. అంచనాలను పెంచను అంటూ..
Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జైలర్ 2’. మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో, సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాపై వస్తున్న హైప్ గురించి చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ మీడియాతో మాట్లాడిన నెల్సన్, అభిమానుల అంచనాలను తగ్గించే ప్రయత్నం చేశారు.
నెల్సన్ మాట్లాడుతూ.. “జైలర్ 2 విడుదలయ్యే వరకు వేచి ఉండండి. రజనీకాంత్ మ్యాజిక్ ఏమిటో వెండితెరపై చూసి ఆనందించండి. ముందుగానే సినిమా గురించి భారీ ప్రకటనలు చేసి, అంచనాలను పెంచడం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ సినిమా ఆ అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే ప్రేక్షకులు నిరాశ చెందుతారు. అందుకే అంచనాలను పెంచకుండా, సినిమా కంటెంట్‌పై దృష్టి పెట్టడమే ఉత్తమం” అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన సినిమాపై అనవసరమైన హైప్ క్రియేట్ చేయకుండా సైలెంట్‌గా పని చేయాలనుకుంటున్నారని స్పష్టమవుతోంది.
‘జైలర్’ సినిమాతో నెల్సన్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ డ్రామాను తెరకెక్కించి, రజనీకాంత్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఈ సినిమా దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పాత్రలు సీక్వెల్లో కూడా కొనసాగనున్నాయి. అంతేకాకుండా, టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ కూడా ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం ‘జైలర్ 2’ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, రజనీకాంత్ కూడా కథపై సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ‘కూలీ’ చిత్రం కొంత నిరాశపరచడంతో, ‘జైలర్ 2’తో రజనీకాంత్ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తమిళనాడుతో పాటు, సౌత్ ఇండియా మొత్తం మోస్ట్ హైప్డ్ మూవీగా నిలిచింది.
