Tanushree Dutta: బిగ్‌బాస్.. మగాడితో ఒకే మంచంపై పడుకుంటే కోట్లు ఇస్తామన్నారు: తనుశ్రీ దత్తా
Tanushree Dutta: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ‘అల్లరి పిడుగు’, ‘వీరభద్ర’ వంటి సినిమాల ద్వారా ఆమె సుపరిచితురాలే. తాజాగా, సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనుశ్రీ దత్తా మాట్లాడుతూ, “గత పదకొండు సంవత్సరాలుగా బిగ్ బాస్ టీమ్ నన్ను సంప్రదిస్తోంది. ప్రతిసారీ నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. నేను నా సొంత కుటుంబంతో కూడా కలిసి ఉండను. అలాంటి నేను, బయటి వ్యక్తులతో ఒకే ఇంట్లో ఎలా ఉండగలను? ఆ షో అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఎప్పటికీ ఉండదు” అని స్పష్టం చేశారు.
ఆమెకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినా సరే తాను ఒప్పుకోలేదని తనుశ్రీ తెలిపారు. “బిగ్ బాస్ టీమ్ నాకు రూ.1.65 కోట్లు ఆఫర్ చేశారు. నా స్థాయిలోని మరో నటి కూడా అంతే మొత్తం తీసుకుందని నాకు తెలిసింది. కానీ నేను ఖచ్చితంగా ‘నో’ చెప్పాను. ఆ షోలో మగవారు, ఆడవారు ఒకే హాల్‌లో పడుకుంటారు, ఒకే బెడ్‌పై కలిసి పడుకునేంత చీప్ మెంటాలిటీ నాది కాదు. నా వ్యక్తిగత స్వేచ్ఛ నాకు చాలా విలువైనది. ప్రశాంతంగా పని చేసుకునే అవకాశం ఇస్తే, నేను ఆ మొత్తం కంటే ఎక్కువ సంపాదించగలను” అని అన్నారు.
‘బిగ్ బాస్’ షోలో కనిపించే మోసాలు, గొడవలు తనకు నచ్చవని ఆమె తెలిపారు. తన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలు షోను కించపరిచేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ లాంటి షోలలో పాల్గొనడానికి చాలామంది ఎదురు చూస్తుండగా, తనుశ్రీ దత్తా చేసిన ఈ కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.