Ilaiyaraaja: అజిత్ సినిమా తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. ఇళయరాజా పిటిషన్‌తో కీలక నిర్ణయం
Ilaiyaraaja: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను ఉన్నపలంగా తొలగించారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం, సినిమాలోని పాటల వినియోగంపై తలెత్తిన కాపీరైట్ వివాదం.
గతంలో థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం, మే 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాలో తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ, ఆ పాటలను తక్షణమే తొలగించాలని, జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు, ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది.
ఈ వివాదంపై చిత్ర నిర్మాత రవి ఇటీవలే మీడియాకు వివరణ ఇచ్చారు. సినిమా విడుదలకు ముందే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనల ప్రకారమే పాటలను ఉపయోగించామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్, కోర్టు ఆదేశాలతో నిర్మాత వాదనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా వివాదం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అజిత్ అభిమానుల్లో ఈ పరిణామం కొంత నిరాశను కలిగించింది. ఈ వివాదంపై తదుపరి విచారణ ఎలా ఉండబోతుందో, సినిమా తిరిగి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
నిజానికి, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కాపీరైట్ వివాదాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. ఆయన తన పాటలపై హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. గతంలో ఆయన కొన్ని మ్యూజిక్ కంపెనీలతో, అలాగే గాయకులతో కూడా ఇలాంటి వివాదాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా, తన పాటలను అనుమతి లేకుండా కచేరీలలో పాడినందుకు గాను ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారికి నోటీసులు పంపించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.