Manchu Manoj: చిరంజీవి, మోహన్‌బాబుల కొడుకులే కాదు.. ఎవరైనా హీరోలు కావొచ్చు: మంచు మనోజ్
Manchu Manoj: నటుడు మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయం మనోజ్‌కి చాలా కాలం తర్వాత ఒక మంచి బ్రేక్ ఇచ్చింది. సినిమా సక్సెస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. తన సినీ ప్రయాణం గురించి, అభిమానుల ప్రేమ గురించి మనోజ్ మాట్లాడుతూ, ఇండస్ట్రీలో నిలబడాలనే తపన ఉంటే ఎవరైనా హీరోలు కావచ్చు అని నొక్కి చెప్పారు.
‘మిరాయ్’ చూసిన తర్వాత తన తల్లి, సోదరి నుంచి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయని మనోజ్ తెలిపారు. తన తల్లి ‘మహావీర్ లామా’ పాత్రలో తాను అదరగొట్టానని మెచ్చుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ విజయం అభిమానులకు అంకితమిస్తున్నానని, ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేనని మనోజ్ ఎమోషన్ అయ్యారు. ‘ఇప్పుడు నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందని గర్వంగా చెబుతాను’ అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ‘మిరాయ్’ నిర్మాత విశ్వప్రసాద్‌ను మనోజ్ ఆకాశానికెత్తేశారు. ‘విశ్వప్రసాద్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండరు. ఏ సినిమా అయినా రాజీ పడకుండా నిర్మిస్తారు’ అని ప్రశంసించారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న విమర్శలను ‘మిరాయ్’ విజయం తిప్పికొట్టిందని, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరణ అందిస్తారని మరోసారి రుజువైందని మనోజ్ తెలిపారు.
కొత్త తరం హీరోలకు మనోజ్ స్ఫూర్తి
ఇటీవల విజయం సాధించిన చిత్రాల గురించి మాట్లాడుతూ, యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంపై మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మోహన్ బాబు కొడుకు, చిరంజీవి కొడుకే కాదు.. ఎవరైనా హీరో అవ్వొచ్చని మౌళి నిరూపించాడు’ అని ప్రశంసించారు. మౌళీ చిత్రంలో విలన్ పాత్ర ఉంటే తాను చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, తమ ‘మిరాయ్’తో పాటు విడుదలైన ‘కిష్కింధపురి’ కూడా విజయం సాధించడం పట్ల మనోజ్ హర్షం వ్యక్తం చేస్తూ, ఒకేసారి రెండు సినిమాలు హిట్ అవ్వొచ్చని నిరూపించామని పేర్కొన్నారు.
అదే సమయంలో, సోదరి లక్ష్మీ మంచు నటించిన ‘దక్ష’ సినిమా కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక, తన అన్నయ్య, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ చిత్రంపై కూడా మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాసిపెట్టుకోండి.. ‘ఓజీ’ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది’ అని ఆయన అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఈ నెల మర్చిపోలేనిదిగా మిగిలిపోతుందని కూడా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో డేవిడ్ రెడ్డి, ‘అబ్రహం లింకన్’, ‘రక్షక్’ వంటి చిత్రాల్లో నటించనున్నట్లు కూడా మనోజ్ తెలిపారు.