Tamannaah: మిల్కి బ్యూటీకి జోరుగా ఆఫర్లు.. ప్లస్ పాయింట్గా మారిన ఐటమ్ సాంగ్స్!
Tamannaah: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్లు తమ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తే అది ఒకరకంగా తమ కెరీర్కు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అనే అభిప్రాయం ఉండేది. ఒకసారి ఐటమ్ గర్ల్స్గా మారితే, మళ్లీ హీరోయిన్గా అవకాశాలు రావడం కష్టం అని నమ్మేవారు. అయితే, ఈ పాత ఆచారాలకు బ్రేక్ వేసి కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసింది హీరోయిన్ తమన్నా భాటియా. ఇప్పుడు ఆమె హీరోయిన్గా నటిస్తూనే, ప్రత్యేక పాటల్లో నర్తిస్తూ రెండు విధాలుగా ఆఫర్లను దక్కించుకోవచ్చని నిరూపిస్తోంది.
తమన్నా ఇప్పటివరకు దాదాపు పదికి పైగా స్పెషల్ సాంగ్స్లో మెరిసి, ఐటమ్ సాంగ్స్కు పర్యాయపదంగా మారింది. ‘స్వింగ్ జరా’ నుంచి ‘కావాలా’ వరకు ఆమె చేసిన పాటలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ‘కేజీఎఫ్’లోని ‘జోక్’ సాంగ్, ‘సరిలేరు నీకెవ్వరు’లోని ‘డాంగ్ డాంగ్’, ‘ఎఫ్2’లోని ‘గిర్రా గిర్రా’ పాటలు యూత్ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటల్లో ఆమె డాన్స్, గ్లామర్, ఎనర్జీ సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చాయి. ఇటీవల ‘కావాలా’ పాటతో అయితే తమన్నా దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. ఈ పాటలోని ఆమె డ్యాన్స్ స్టెప్స్, ఎనర్జీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు, ‘స్త్రీ 2’లోని ‘ఆజ్ కీ రాత్’ పాటతో మరోసారి అభిమానులను అలరించడానికి సిద్ధమైంది.
సినిమాలతో పాటు డిజిటల్ స్క్రీన్ పైనా తమన్నా తన గ్లామర్ డోస్ పెంచనుంది. బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’లో ఒక స్పెషల్ సాంగ్లో నటించనుంది. షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
ఆర్థికంగా కూడా లాభం..
ఒక సినిమా కోసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు పనిచేస్తే రూ. 4 నుంచి రూ. 5 కోట్లు సంపాదిస్తుండగా, తమన్నా కేవలం కొన్ని రోజుల్లో పూర్తిచేసే ఐటమ్ సాంగ్ కోసం రూ. 1 నుంచి రూ. 2 కోట్లు వసూలు చేస్తోంది. ఈ లెక్కన చూస్తే, రెండు స్పెషల్ సాంగ్స్ చేస్తే ఒక సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ లభిస్తుంది. అందుకే, ఆమె సినిమాలతో పాటు ఈ ప్రత్యేక పాటలపై కూడా దృష్టి పెడుతోంది. స్పెషల్ సాంగ్స్ చేయడం వల్ల కెరీర్కు నష్టమని భావించిన రోజులు పోయాయి, తమన్నా వంటి కథానాయికలు వాటిని తమ కెరీర్కు అదనపు బలంగా మార్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం తమన్నా చేతిలో ‘రొమియో’, ‘రేంజర్’ వంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి.
