Samantha: ఆ ఒక్కటే ముఖ్యమైనది.. మిగతావన్నీ జుజుబీ: సమంత
Samantha: ప్రముఖ నటి సమంత తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆరోగ్యం ముందు ఏ సమస్యా పెద్దది కాదని ఆమె వెల్లడించారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా లేనప్పుడు మిగతా సమస్యలన్నీ చిన్నవిగా కనిపిస్తాయని ఆమె అన్నారు. గతంలో తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల వల్ల జీవితం పట్ల తన దృక్పథం పూర్తిగా మారిందని ఆమె స్పష్టం చేశారు.
సమంత మాట్లాడుతూ, “ఆరోగ్య సమస్యలు లేనప్పుడు చిన్నచిన్న ఇబ్బందులకే మనం కృంగిపోతాం. వంద సమస్యలు ఉన్నట్లుగా భావిస్తాం. కానీ ఒక్కసారి అనారోగ్యానికి గురైతే, ఆ ఒక్క సమస్య ముందు మిగతావన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. అప్పుడు మన దృష్టి మొత్తం ఆరోగ్యంపైనే ఉంటుంది,” అని అన్నారు. ప్రస్తుతం తాను ఆహారం, నిద్ర, మానసిక ప్రశాంతతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని, గతంతో పోలిస్తే ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నానని ఆమె తెలిపారు. అందుకే ఇప్పుడు తాను ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు.
ఈ ఆలోచనా విధానం ఆమె కెరీర్ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపిందని సమంత వెల్లడించారు. “ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత మంచి సినిమాలు చేశామన్నదే ముఖ్యం” అనే సిద్ధాంతాన్ని ఇప్పుడు తాను పాటిస్తున్నానని చెప్పారు. ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు కాకుండా, తన శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ తక్కువ సినిమాలు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
‘‘కొన్నేళ్ల క్రితం, ఒక సంవత్సరంలో నేను నటించిన ఐదు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అది విజయానికి నిర్వచనంగా భావించాను. టాప్ 10 నటీనటుల జాబితాలో ఉండటం, వెయ్యి కోట్ల క్లబ్లో చేరడమే నా లక్ష్యంగా ఉండేది. కానీ, గత రెండేళ్లుగా నా సినిమాలు పెద్దగా విడుదల కాలేదు. నేను టాప్ 10 లిస్ట్‌లో కూడా లేను. అయినా నేను ఇప్పుడు ఉన్నంతలో సంతోషంగానే ఉన్నాను’’ అని సమంత వెల్లడించారు.
ప్రస్తుతం సమంత రాజ్, డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో ఆమెతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.