Kantara Chapter 1: కాంతారకు మించి చాప్టర్ 1.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్
Kantara Chapter 1: 2022లో సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఏ అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘కాంతార’ లాగే, ఈ ప్రీక్వెల్ కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
ట్రైలర్‌ను చూస్తే, ఈసారి రిషబ్‌శెట్టి ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారని అర్థమవుతోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. రిషబ్‌శెట్టి తన పాత క్యారెక్టర్‌కు భిన్నంగా, ఒక గంభీరమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన నటన, స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. రుక్మిణి వసంత్ మహారాణి పాత్రలో తన అందం, హుందాతనంతో మెరిసిపోయారు. విలన్‌గా గుల్షన్ దేవయ్య కూడా ఆకట్టుకునే నటనను కనబరిచారు.
‘కాంతార’ మొదటి భాగంలో డ్రామాను సింపుల్‌గా చూపించగా, ‘కాంతార చాప్టర్ 1’లో మాత్రం కథను విస్తృతం చేసినట్టు కనిపిస్తోంది. రాజులు, యుద్ధాలు, రాజకుమారితో హీరో ప్రేమకథ వంటి అంశాలను ఈసారి భారీగా చూపించనున్నారు. తొలి భాగాన్ని మించి అంచనాలను పెంచుతూ, ఈసారి భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సినిమా మొత్తం ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘కాంతార చాప్టర్ 1’ కూడా తొలి భాగాన్ని మించిన విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.